హోదా ఉద్యమకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్
ప్రత్యేక హోదా కోసం పోరుబాట పట్టిన వారికి ఊరట కల్గించే నిర్ణయం వెలువడింది
ప్రజావేదికలో పోలీసులు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా కేసుల ఎత్తివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, బంద్ లు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆందోళనలో పాల్గొన్న వేలాది మంది పై అనేక కేసులు నమోదయ్యాయి. తాజా నిర్ణయంతో అలాంటి వారికి కేసుల నుంచి విముక్తి కల్పించినట్లయింది.
ఎన్నికల సమయంలో జగన్... ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కేసులను ఎత్తివేయాలని పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు. కాగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో కేసులను ఎదుర్కొంటున్న వేలాది మందికి ఊరట లభించనుంది. తాజా ఆదేశాలతో ఉద్యమకారులు, మేధావులు, బాధిత కుటుంబాలకు చెందిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.