ఉద్యోగ అభ్యర్ధులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం జగన్
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు
ప్రభుత్వ కొలువ కోసం దరఖాస్తుల చేసుకున్న వారందరికీ ఏపీ సీఎం జగన్ ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలు, పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలు భర్తీకి సన్నాహకాలు జరుగుతున్నాయి.
సెప్టెంబర్ 1న పరీక్ష
నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష సెప్టెంబరు ఒకటవ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు లక్షల సంఖ్యలో అభ్యర్ధులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ అభ్యర్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ వేదికగా ఈ మేరకు స్పందించారు.
ఉద్యోగాలకు భారీ స్పందన
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ కు అనూహ్య స్పందన వస్తోంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం సోమవారం ఒక్కరోజే 1.34లక్షల మందికిపైగా దరఖాస్తులు అందాయి. మొత్తంగా ఈ రోజు సాయంత్రం వరకు 4.67 లక్షల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు