అమరావతి: ఏపీ సెక్రటేరియట్‌లో అడుగుపెట్టిన తొలి రోజే సెక్రటేరియట్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త తెలిపారు. శనివారం ఉదయం సచివాలయానికి వెళ్లిన వైఎస్ జగన్.. అక్కడి ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సచివాలయంలో పనిచేస్తోన్న ఉద్యోగులతో కాసేపు ముచ్చటించిన జగన్... అనంతరం వారికి 20% ఐఆర్ (మధ్యంతర భృతి) అందించనున్నట్టు ప్రకటించారు. అలాగే సచివాలయంలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. కేబినెట్‌ భేటీలో ఐఆర్, సీపీఎస్ రద్దు విషయంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని జగన్ స్పష్టంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా కొన్నిసార్లు ప్రభుత్వాలు మారినప్పడు.. సచివాలయంలో కీలక విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల స్థానాలు సైతం మారుతుండటం తెలిసిందే. ప్రభుత్వాలు మారిన ప్రతీసారి ఈ విషయంలో ఉద్యోగుల్లోనూ ఏదో తెలియని అభద్రతా భావం వెంటాడుతుండటం కూడా సర్వసాధారణమే. అయితే ఇదే విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందిస్తూ.. గత ప్రభుత్వాలతో సన్నిహితంగా పనిచేసిన వారిని తాను తప్పుబట్టనని, ఎవరి విధులు వారు నిర్వహిస్తుంటారని అన్నారు. 


వైఎస్ జగన్ ప్రకటనతో సచివాలయ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. జగన్ ఇచ్చిన హామీలపట్ల హర్షం వ్యక్తంచేసిన ఉద్యోగులు.. జై జగన్.. జైజై జగన్ అనే నినాదాలతో హోరెత్తిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.