అమరావతి: వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం తరపున ప్రతినిధిగా విజయసాయి రెడ్డిని నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంతో విజయసాయి రెడ్డికి సైతం కేబినెట్ మంత్రి హోదా లభించినట్టయింది. శనివారం సాయంత్రం నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
2014 తర్వాత టీడీపీ ప్రభుత్వం హయాంలో కంభంపాటి రామ్మోహన్ రావు ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో సేవలు అందించారు. అయితే, 2019 ఎన్నికల్లో ఓడిపోయి ఏపీలో అధికారం కోల్పోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అలా ఖాళీ అయిన ఆ స్థానంలో తాజాగా విజయసాయి రెడ్డిని నియమిస్తూ శనివారం సాయంత్రం ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది.