AP CM YS Jagan meets Governor Biswabhushan: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ  అయ్యారు. కేవలం మర్యాదపూర్వకంగానే సీఎం జగన్ గవర్నర్‌ను కలిశారు. ఈ భేటీకి ఇతర ప్రాధాన్యత ఏదీ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా... కేబినెట్ మార్పు గురించి చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా బడ్జెట్ సమావేశాల అనంతరం సీఎం గవర్నర్‌ను కలవడం అనేది ఓ ఆనవాయితీగా వస్తోంది. అయితే బడ్జెట్ సమావేశాల ( AP Budget sessions ) సందర్బంగా ఉభయ సభల్ని ఉద్దేశించి సాగిన గవర్నర్ ప్రసంగం కోవిడ్ 19 నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. దాంతో బడ్జెట్ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గవర్నర్‌లు కలవలేకపోయారు. ఈ ఆనవాయితీలో భాగంగానే మర్యాదపూర్వకంగా ఇవాళ గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. దాదాపు అరగంటసేపు సాగిన ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల వివరాలతో పాటు కరోనా నియంత్రణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కోవిడ్ నిర్దారణ పరీక్షల ప్రస్తావన సాగినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6 లక్షల 77 వేల కరోనా నిర్దారణ పరీక్షలు ( Coronavirus tests) నిర్వహించడం ద్వారా దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని సీఎం జగన్ గవర్నర్‌కు గుర్తుచేశారు. శాసన మండలి సమావేశాలు జరిగిన తీరు, పెండింగ్ బిల్లులు గురించి గవర్నర్‌తో సీఎం చర్చించినట్టు సమాచారం. ఏపీకి చెందిన ఇద్దరు మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎంపిక అవడంతో చేయాల్సిన కేబినెట్ మార్పులపై ప్రధానంగా ఈ భేటీలో చర్చ సాగినట్టు తెలుస్తోంది.  


ఈ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి, మరి కొంతమంది వెంట ఉన్నారు. గవర్నర్‌తో భేటీ కంటే ముందే వైఎస్ జగన్ కరోనా నియంత్రణపై అధికారులతో చాలాసేపు సమీక్ష ( AP CM YS Jagan review on COVID-19 ) నిర్వహించి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా రానున్న 3 నెలల కాలంలో ఇంటింటికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.