చిత్తూరు: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. గురువారం చిత్తూరులోని పీవీకెఎన్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి ముందు చేసిన పాదయాత్రలో  నవరత్నాలు పేరిట ఇచ్చిన హామీల్లో మరో హామీని నెరవేర్చినట్టయింది. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకాల్లో అమ్మ ఒడి పథకం కూడా ఒకటి. తమ పిల్లలను గొప్ప చదువులు చదివిపించి వారిని ఉన్నత స్థానంలో చూడాలని ప్రతీ తల్లిదండ్రులూ కలల కంటారని... కానీ ఎంతోమందికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా పిల్లలకు బడికి పంపివ్వకపోవడాన్ని తాను తన పాదయాత్రలో చూశానని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేసుకున్నారు. ఇకపై ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ తల్లిదండ్రులూ తమ పిల్లలను బడికి పంపివ్వకుండా ఉండకూడదనే ఉద్దేశంతోనే తాను అమ్మఒడి పథకం తీసుకొచ్చినట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్మీడియెట్ స్టూడెంట్స్‌కి కూడా.. 
1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే పిల్లలు ఉన్న ప్రతీ తల్లికి ఏడాదికి రూ.15,000 వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు. తొలుత 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థిని, విద్యార్థులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని అమ్మ ఒడి పథకం తీసుకొచ్చినప్పటికీ.. ఈ పథకం ప్రయోజనాలను ఇంటర్మీడియెట్ చదివే స్టూడెంట్స్ ఉన్న తల్లిదండ్రులకు కూడా వర్తింపజేస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఇంటర్మీడియెట్‌లో చేరుతున్న విద్యార్థిని, విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే.. కేవలం 23 శాతం మంది మాత్రమే ఇంటర్మీడియెట్ విద్యను అభ్యసిస్తున్నట్టుగా తేలిందని.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాలేజీ చదువులకు దూరమవుతున్న మిగతా 77 శాతం మంది విద్యార్థులను దృష్టిలో పెట్టుకునే ఈ పథకం ఫలాలను వారికి వర్తింపచేసినట్టు సీఎం జగన్ పేర్కొన్నారు. 


42.2 లక్షల మంది తల్లులకు రూ.6,318 కోట్లు..
అమ్మ ఒడి పథకం ద్వారా 42.2 లక్షల మంది తల్లులకు అందరికీ కలిపి రూ.6,318 కోట్లు వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనున్నట్టు సీఎం జగన్ స్పష్టంచేశారు. అంతేకాకుండా కేవలం ఈ ఏడాది కోసం 75 శాతం హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..