అసెంబ్లీలో చంద్రబాబుని ఎద్దేవా చేస్తూ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన టీడీపి
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం హోదాలో వైఎస్ జగన్ హాజరవడంపై ఏపీ అసెంబ్లీలో రభస
అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆల్మట్టి డ్యామ్ నిర్మించారు. ఆయన హయాంలోనే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. అప్పుడు ఏమీ చేయకుండా చూస్తూ కూర్చున్న చంద్రబాబు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లిన తనపై విమర్శలు గుప్పించడం ఏంటంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ ప్రాజెక్టుల అభివృద్ధి పనులు జరుగుతుంటే అప్పుడు చంద్రబాబు గాడిదలు కాశారా అని వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లినా వెళ్లకపోయినా ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఆగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలావుంటే, ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. చంద్రబాబుని ఉద్దేశించి జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, తమ నాయకుడికి క్షమాపణలు చెప్పాలని టిడిపి సభ్యులు డిమాండ్ చేశారు.