న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న అఖిలపక్ష సమావేశానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. జేడీయు తరపున బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, నేషనల్ కాన్ఫరెన్స్ తర్వాత ఫరూక్ అబ్దూల్లా, శిరోమణి అకాలి దళ్ తరపున సుఖ్బీర్ సింగ్ బాదల్, బిజూ జనతా దళ్ తరపున ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పీడీపీ తరపున మెహబూబా ముఫ్తి, తదితర నేతలు హాజరయ్యారు. దేశంలో లోక్ సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే అంశంతోపాటు పలు ఇతర అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన ఈ అఖిలపక్ష సమావేశానికి పలు పార్టీల అధినేతలు డుమ్మా కొట్టారు. 


అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరైనవారిలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు, టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి, తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉన్నారు. కేసీఆర్ తరఫున ఆయన కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చంద్రబాబు నాయుడు తరఫున గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ హాజరుకానున్నారు.