Jagananna Vasathi Devena Money: ఈ సందర్భంగా సీఎం వైయస్‌. జగన్‌ మాట్లాడుతూ.. చిక్కటి ఆప్యాయతల మధ్య చెరగని చిరునవ్వుల మధ్య ఇలాంటి ప్రేమానురాగాలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికి, ప్రతి అవ్వాతాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా 9,55,662 మంది పిల్లలకు మంచి చేస్తూ... 8,61,138  తల్లుల ఖాతాల్లోకి నేరుగా  రూ.912.71 కోట్లు జమ చేస్తున్నాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చదువు కుటుంబ చరిత్రను మారుస్తుంది.
మన పిల్లల చదువులకి సంబంధించిన కార్యక్రమం ఇది. చదువు ఒక మనిషిని ఎంత గొప్పగా మారుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు.. ఆ కుటుంబాలకు సంబంధించిన సామాజిక వర్గాన్నే మారుస్తుంది. కులాల చరిత్రను మారుస్తుంది. పేదరికపు సంకెళ్లను తెంచుకోవాలంటే అది కేవలం చదువు అనే ఒకేఒక్క అస్త్రంతో సాధ్యమవుతుంది. చదువు జీవితాలను మారుస్తుందని గట్టిన నమ్మని ప్రభుత్వంగా ఈ నాలుగు సంవత్సరాలు ప్రతి అడుగు పిల్లలకోసమే వేశాం.


మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని..
రాబోయే తరాలు ప్రపంచంతో పోటీపడాలి, రాబోయే తరాలు పేదరికం నుంచి బయటకు రావాలంటే కచ్చితంగా వాళ్లంతా గొప్పగా చదవాలి. చదువులు కోసం ఎవరూ కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదన్న తపన, తాపత్రయంతో అడుగులు వేశాం.
చదువు అంటే మొక్కుబడిగా  చదివించామన్నట్టు కాకుండా.. ఆ చదువులు వల్ల జీవితాలు బాగుపడాలి అని ఈ రంగంలో మార్పులు తీసుకువస్తూ అడుగులు వేశాం. నాణ్యమైన చదువు ప్రతి ఊరులోనూ, ప్రతి జిల్లాలోనూ తీసుకునిరావాలని వేగంగా అడుగులు వేశాం.ఈ నాలుగేళ్లలో అలాంటి నాణ్యమైన చదువులు, విద్యారంగంలో విప్లవాత్మకమార్పులు తీసుకునివచ్చాం. 


తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదనే...
ఇవాళ జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. జగనన్న విద్యాదీవెన కార్యక్రమం ఒక్కటే సరిపోదు దానికి తోడుగా.... జగనన్న వసతి దీనెన కూడా ఉంటేనే పిల్లలకు ఇంకా మంచి జరుగుతుంది, పిల్లలు చదువుకునేదానికి ఏ ఒక్కరూ కూడా అప్పులు పాలయ్యే  పరిస్థితి రాకూడదన్న తపన, తాపత్రయంతో జగనన్న వసతి దీవెన తీసుకొచ్చాం.
పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యాదీవెనే కాకుండా... ఒకవైపు పూర్తిగా ఫీజులు చెల్లిస్తూనే.. మరోవైపు పిల్లలు బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌కు ఇబ్బంది పడకూడదన్న ఉద్ధేశంతో ఈ రోజు సుమారు రూ.913 కోట్లు బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నాం.


ఐటీఐ చదువుతున్న పిల్లలకు, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న పిల్లలందరికీ ఈ వసతి దీవెన పథకాన్ని అమలు చేస్తున్నాం. ఐటీఐ పిల్లలకు ఏడాదికి రూ.10వేల చొప్పున, పాలిటెక్నిక్‌ పిల్లలకు ఏడాదికి రూ.15వేలు చొప్పున, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న పిల్లలకు రూ.20 వేలు ఏడాదికి ఆర్ధిక సహాయం అందిస్తూ.. తల్లుల ఖాతాల్లో జమ చేసే గొప్ప కార్యక్రమం జగనన్న వసతిదీవెన. ఇవాళ 9.55 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ 8.61 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.913 కోట్లు జమ చేస్తున్నాం.


ఆలోచన చేయండి.
గతంలో కూడా పాలకులను చూశారు. పరిపాలన చూశారు.ఈ నాలుగు సంవత్సరాలు తిరక్కమునుపే మీ జగనన్న ప్రభుత్వం.. కేవలం జగనన్న విద్యాదీవెన, జగన్న వసతి దీవెన అనే రెండు పథకాల కోసమే రూ.14,223 కోట్లు ఖర్చుచేశాం.


గతంలో మనసులేని ప్రభుత్వం...
గత ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని విషయాలను మనమందరం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పరిస్థితి ఎలా ఉండేదో అర్ధమయ్యేట్టు చెపుతాను. భోజన వసతి ఖర్చులు .. విద్యాదీవెన రూపేణా దేవుడెరుగు.. పెద్ద చదువులు చదువుతున్న పేద పిల్లలకు వందశాతం  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలన్న మనసు లేని పరిస్థితి గత ప్రభుత్వానిది. 
ఆ రోజుల్లో ఫీజులు కూడా అరకొరగా ఇచ్చేవారు. ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా దులుపుకునిపోయే మనస్తత్వం. 
2017–18, 2018–19 కి సంబంధించిన బకాయిలు ఏకంగా రూ.1778 కోట్లు పెట్టి వెళ్లిపోయిన పరిస్థితులు గత ప్రభుత్వంలో చూశాం. ఒక్కసారి ఆలోచన చేయండి. 
గతంలో పిల్లలకు మంచి జరగాలి, వారిని మంచిగా చదివించాలన్న తపన, తాపత్రయం ఏరోజూ కనిపించలేదు. 


పిల్లల చదువుల కోసం తపిస్తున్న ప్రభుత్వమిది.
ఈ రోజు మాత్రం పిల్లలు ఎలా చదువుతున్నారు ?, వారికి మంచి చదువులు అందుతున్నాయా ? పిల్లలకు అందాల్సింది సరైన సమయంలో అందుతుందా ? లేదా ? అని చూస్తున్నాం.
ప్రతి మూడు నెలలు అయిన వెంటనే అంటే మొదటి క్వార్టర్‌ ముగిసిన తర్వాత రెండో క్వార్టర్‌ లోపు తొలి మూడు నెలలకు సంబంధించిన డబ్బులను నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం.


గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను కచ్చితంగా గమనించండి. గత ప్రభుత్వంలో పేద పిల్లలు ఎప్పటికీ పేదపిల్లలుగానే మిగిలిపోవాలని చేసిన ఆలోచనలు. ఆ దిక్కు మాలిన ఆలోచనల్లో పేదలు ఎప్పుడూ కూలీలుగానో, కార్మికులుగానో, చిరుద్యోగులుగానే మిగిలిపోవాలనే పెత్తందారీ మనస్తత్వం గత పాలనలో కనిపిస్తోంది.


విద్యారంగంలో నేడు గణనీయ మార్పులు..
ఈ రోజు మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అడుగులు వేగంగా వేస్తున్నాం, కాబట్టే నాలుగేళ్లు తిరగక ముందే విద్యారంగంలో కూడా గణనీయమైన ఫలితాలు మన కళ్లెదుటనే కన్పిస్తున్నాయి. విద్యారంగంలో డ్రాపౌట్లు గణనీయంగా తగ్గాయి. 18 నుంచి 23 సంవత్సరాల వయస్సులో ఉన్న వాళ్లలో  కాలేజీలలో చేరుతున్న వారిసంఖ్యను జీఈఆర్‌ రేషియో అంటారు. ఈ రేషియో రాష్ట్రంలో మనం అధికారంలోకి వచ్చే నాటికి అంటే 2018–19 నాటికి 32.4 శాతం ఉంటే.. ఆ రేషియో సరిపోదు 70–80 శాతం ఉండాలి అని మీ జగనన్న అడుగులు వేయిస్తున్నాడు. విద్యారంగంలో మనం చేస్తున్న మార్పులతో వచ్చిన ఫలితం ఎలా ఉందో తేడా చూడండి.


గతానికీ నేటికీ తేడా...
గతానికి ఇప్పటికీ సదుపాయాల పరంగా కానీ, విద్యారంగంలో ప్రమాణాల పరంగా కానీ ప్రభుత్వ బడులు ప్రైవేటు స్కూళ్లలో పోటీ పడే పరిస్థితి కానీ చూడండి. గతంలో ప్రభుత్వ బడులు ప్రయివేటు స్కూళ్లలో పోటీపడే పరిస్థితి ఎప్పుడు వస్తుందనేవాళ్లు. అటువంటి పరిస్థితి నుంచి మనం తీసుకువచ్చిన, తీసుకువస్తున్న మార్పుల వలన ఈ రోజు రాష్ట్రంలో ప్రయివేటు స్కూళ్లు ప్రభుత్వ స్కూళ్లలో పోటీపడే పరిస్థితి వచ్చింది. ఆ మేరకు వేగంగా అడుగులు పడుతున్నాయి.


ఈ రోజు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు, బైజూస్‌తో ఒప్పందం ద్వారా బైజూస్‌ కంటెంట్‌ వచ్చాయి. 8వతరగతి విద్యార్ధులకు ట్యాబులు కూడా ఇస్తున్నాం.   
ఈ జూన్‌ నెల నుంచి నాడు నేడు మొదటిదఫా పూర్తిచేసుకున్న 15,750 స్కూళ్లలో 6వతరగతి ఆ పై తరగతులకు సంబంధించిన దాదాపు 30,230 తరగతిగదుల్లో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా డిజిటల్‌ బోధనవైపు ప్రభుత్వ స్కూళ్లన్నీ అడుగులువేస్తున్నాయి. 


ప్రభుత్వ స్కూళ్లతో పోటీగా ప్రైవేటు స్కూళ్లు...
ప్రభుత్వ స్కూళ్లలో మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్‌ టీచర్లు కాన్సెప్ట్‌ను తీసుకొచ్చిన చరిత్ర ఈ నాలుగేళ్ల పాలనలో కనిపిస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో రోజుకొక మెనూతో గోరుముద్ద కనిపిస్తుంది. ప్రభుత్వ బడులన్నీ నాడు నేడుతో రూపురేఖలు మారుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ప్రభుత్వ స్కూళ్లలో 8వతరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వడం మొదలుపెట్టామో.. 6వతరగతి నుంచి ప్రతి క్లాస్‌ రూంలో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌తో డిజిటల్‌ బోధన ద్వారా చదువులు చెప్పడం మొదలుపెడతామో... ఆరోజు ప్రైవేటు స్కూళ్లు కూడా ప్రభుత్వ స్కూళ్లతో పోటీపడిక తప్పదు. వాళ్లు కూడా 8వతరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వకతప్పదు, వాళ్లు కూడా 6వతరగతి నుంచి అన్ని తరగతి గదుల్లో ఐఎఫ్‌పిల ద్వారా డిజిటల్‌ బోధన చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.
ప్రభుత్వ స్కూళ్లలో ప్రయివేటు స్కూళ్లు పోటీపడక తప్పని పరిస్థితి ఈ నాలుగేళ్ల పాలనలో కనిపిస్తుంది.


నేడు ప్రభుత్వ స్కూల్‌ ఒక నమ్మకం...
గతంలో 2018–19లో మన ప్రభుత్వం రాక ముందు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు 37  లక్షల మంది అయితే ఈరోజు ఈ సంఖ్య 40 లక్షలు దాటుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదవడానికి వాళ్లకి ఇవాళ ఒక నమ్మకం కనిపిస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే అన్న ఉన్నాడు, బాగా చదివిస్తాడని మన ప్రభుత్వంమీద  నమ్మకం ఆ ప్రభుత్వ బడుల్లో చదివిస్తున్న అక్కచెల్లెమ్మలకు ఉంది.


అంతేకాకుండా ఈ రోజు మన ప్రభుత్వం చూపిస్తున్న చిత్తశుద్ధికి నిదర్శనం గణనీయంగా తగ్గుతున్న డ్రాపౌట్సే. 12వ తరగతి తర్వాత అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చేరకుండా చదువు మానేస్తున్న పిల్లలు.. 2018–19లో 81,813 మంది ఉంటే... ఈ  నాలుగేళ్లలోనే ఈ సంఖ్యను ఇవాళ 22,387కు తగ్గించగలిగాం. 


మరోవైపు ఇంజనీరింగ్‌ లాంటి పెద్ద చదువులు వారే పరిస్థితి చూస్తే... 2018–19లో ఇంజనీరింగ్‌ చదువుతున్న పిల్లలు 87 వేల మంది ముందుకు వస్తే.. 2022–23లో 1.20 లక్షల మంది పిల్లలు ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. తేడా మీరే చూడండి. 50 శాతం ఎక్కువగా ఉన్నారు.


ఉన్నతవిద్య సమూల మార్పులు...
ఉన్నతవిద్యలో కరిక్యులమ్‌ మార్పు చేశాం.  జాబ్‌ ఓరియెంటెడ్‌గా మార్పులు తీసుకొచ్చాం. 30 శాతం స్కిల్‌ మరియు జాబ్‌ ఓరియెంటెడ్‌గా మార్పులు తీసుకురావడంతో పాటు 25 మార్కెట్‌ ఓరియెంటెడ్‌ కోర్సులతో పాటు 67 బిజినెస్‌ ఓకేషనల్‌ కోర్సులు కూడా కరిక్యులమ్‌లో భాగం చేశాం. దేశంలో తొలిసారిగా నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్‌ ఆనర్స్‌ డిగ్రీని కూడా ప్రవేశపెట్టాం. పిల్లల నైపుణ్యం పెంచడం కోసం అప్‌స్కిల్లింగ్‌ కార్యక్రమాల కోసం దేశంలో మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్‌ కోర్సులను కూడా కరిక్యులమ్‌లో భాగం చేశాం. ఆన్‌లైన్‌ క్రెడిట్స్‌ కూడా అందుబాటులోకి తీసుకొస్తూ.. చదువులన్నీ మార్పు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ కోర్సులను కరిక్యులమ్‌లో భాగం చేయడమే కాకుండా.. స్కిల్‌ ఓరియెంటెడ్‌గా మన పిల్లలు అభివృద్ధి చెందాలన్న ఉద్ధేశ్యంతో మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్ధను కూడా ఈ రోజు మన ఒప్పందంలో భాగం చేశాం. 40 ఫ్యాకల్టీస్‌లో 1.60 లక్షల మందికి సైబర్‌ సెక్యూరిటీ, అజూర్‌ వెబ్‌ సర్వీసెస్, డైనమిక్‌ 365 వంటి అనేక కోర్సుల్లో మైక్రోసాఫ్ట్‌ వాళ్లు మన పిల్లలకు ఉచితంగా చదువులు చెప్పించి, సర్టిఫికెట్‌ ఇచ్చి 1.60లక్షల మంది పిల్లలకు ఈరోజు ఉద్యోగాలు సులువుగా దొరికే విధంగా అడుగులు వేసిన పరిస్థితి కరిక్యులమ్‌లో మనం తీసుకొచ్చిన మార్పుల వల్ల సాధ్యమైంది.


మైక్రోసాప్ట్‌ ఒక్కటే కాకుండా అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, సేల్స్‌ఫోర్స్‌ లాంటి అన్నింటినీ కూడా అనుసంధానం చేసి కరిక్యులమ్‌లో మార్పులు తెచ్చాం. మొట్టమొదటిసారిగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో చదువుతున్న చదువులు ఎలా ఉండాలి ? వాటిని ఎలా అప్‌గ్రేడ్‌ చేయాలి అన్న ఆలోచనలు మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయి.
ఇవాళ మన పిల్లలకు మంచి జరిగేలా మాస్టర్స్‌ ప్రోగ్రాంను జర్మనీకి చెందిన యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నాం. బియస్సీ డ్యూయల్‌ డిగ్రీ ప్రొగ్రాంకు సంబంధించి మెల్‌బోర్న్‌ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుని అడుగులు వేస్తున్నాం. మొట్టమొదటిసారిగా కీలక నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న పిల్లలకు ఇంటెర్నషిప్‌ తప్పనిసరి చేస్తూ మార్పు తీసుకొచ్చాం. పిల్లల చదువులు ఆగిపోకూడదు.


మనం మైక్రోసాఫ్ట్‌ ఎండీ తెలుగువాడని.. సత్యనాదేళ్ల గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒక్క సత్యనాదేళ్ల జగన్‌కు సరిపోడు. నా పిల్లలందరూ సత్యనాదెళ్ల కావాలన్నదే జగన్‌ ఉద్దేశ్యం. నా తమ్ముళ్ల, చెల్లెల్లు అందరూ సత్య నాదేళ్లతో పోటీపడే పరిస్థితి రావాలి. 


జగనన్న విదేశీ విద్యాదీవెన
జగనన్న విదేశీవిద్యాదీవెన అనే పథకాన్ని తీసుకువచ్చాం. టాప్‌ 50 యూనివర్సిటీలలో ఎవరికైనా సీటు వస్తే.. టాప్‌ 50 కాలేజీలలో 21 ఫ్యాకల్టీస్‌లో రూ.1.25 కోట్ల వరకు ఫీజు ప్రభుత్వమే భరిస్తూ.. ఆ పిల్లలను సత్యనాదేళ్ల మాదిరిగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మొన్న క్వార్టర్‌లో దాదాపు 200 మంది పిల్లలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులుగా చేస్తూ... పై చదువులు చదువుకునేందుకు పంపించాం. ఒక ఆలోచన ఎలా మార్పు తీసుకువస్తుందనేదానికి ఇదే నిదర్శనం. రూ.1.25 కోట్లు అంటే స్టాన్‌ఫోర్డ్, ఎంఐటీ, కార్నిగీ మిలన్‌ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు, కాలేజీలలో సీట్లు వచ్చినా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నవారి పరిస్థితిని మార్పు చేస్తూ... మొత్తం ఫీజుకయ్యే ఖర్చును చెల్లిస్తుంది. మీరు చదవండి మిమ్నల్ని చదివించే బాధ్యత మీ అన్నది అని భరోసా ఇస్తున్నాను.


ప్రపంచంలో లీడర్లుగా చేసేందుకు...
మీ అందరికీ ఒకటే చెప్తున్నా. నాలెడ్జ్‌ ఈజ్‌ పవర్‌ అని అంటారు. ఎడ్యుకేషన్‌ ఈజ్‌ నాలెడ్జ్‌ అన్నది మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంది. ఎవరైనా ఎదగాలి. మీ జనగన్న మీ గురించి ఆలోచన చేస్తుంది ప్రపంచంలో బ్రతకడానికి మాత్రమే కాదు... ప్రపంచంలో మిమ్నల్ని లీడర్లుగా చేసేందుకు మీ అన్న ఆలోచన చేస్తున్నాడు. ఎదగాలి అన్న తపన ఉండాలి. తనను తాను నిరూపించుకోవాలన్న నిశ్చయం ఉండాలి. అపారమైన ఆత్మవిశ్వాసం ఉండాలి.  కామన్‌సెన్స్‌ ఉండాలి. వీటన్నింటికీ తోడు మంచి డిగ్రీలు కూడా మీ చేతిలో అందుబాటులోకి వస్తే ఆ తర్వాత ప్రపంచం మీ చుట్టూ తిరుగుతుంది. ఇది ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొండి.


కాసేపు రాజకీయాల గురించి కూడా మాట్లాడతాను. 
ఎందుకు మాట్లాడాలి అంటే రాజకీయాలు మనం చూస్తున్నాం. పొద్దున్న లేస్తూనే మనం రాజకీయాల మధ్య బతుకున్నాం. కాబట్టి కాస్తా కూస్తో రాజకీయాలు కూడా మాట్లాడక తప్పని పరిస్థితి  ఉంది. నిన్ననో మొన్ననో ఒక ముసలాయన మాట్లాడారు. ఆయనెవరో మీకు అందరికీ తెలుసనుకుంటాను. ఈమధ్య కాలంలో రిపబ్లిక్‌ టీవీకి వచ్చీ రానీ  భాషలో ఇంటర్వూ ఇస్తున్నాడు. ఆయన మాటలు వింటున్నప్పుడు.. నాకో కథ గుర్తుకు వచ్చింది. పంచతంత్రంలో మనం చిన్నప్పుడు చదువుకున్నాం. వాటినుంచి మోరల్స్‌ తీసుకుని, నేర్చుకుంటాం. ఆ పెద్దమనిషి ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు నాకో కథ గుర్తుకు వచ్చింది.


ముసలి పులి కథ...
అనగనగా ఒక పులి ఉండేదంట. ఆ పులి మనిషి మాంసం ఒక పద్ధతి ప్రకారం రెగ్యులర్‌గా తినేది. సంవత్సరాలుగా ఆ  పులి నరమాంసం తింటూ వచ్చింది. ఆ తర్వాత ఆ పులి ముసలిది అయింది. ఆ తర్వాత వేటాడే శక్తి పోయింది. పరిగెత్తే ఓపిక పోయింది. కాబట్టి ఆ పులి ఏం చేసిందంటే... ఉన్నచోటే కూర్చుని నాలుగు నక్కలను తోడేసుకుంది. ఉన్నచోటే కూర్చుని నాలుగు నక్కలను కలుపుకుని మనుషులను ఎలా తినాలని చెప్పి ప్లాన్‌ చేయడం మొదలుపెట్టింది. అందులో భాగంగా అంతకముందు తాను మనుషులను చంపేసి... వారి దగ్గర నుంచి దొంగిలించిన బంగారు కడియాలన్నీ ఆ పులి దగ్గరే ఉన్నాయి. అది పట్టుకుని కాలిబాటన పోతున్న మనుషులు అందరికీ ఆ బంగారు కడియాలను చూపించి.. ఆశ  పెట్టించే కార్యక్రమం చేయడం మొదలుపెట్టింది.  


బంగారు కడియం కావాలా తమ్ముళ్లూ... 
అటు పోయే మనుషులతో తమ్ముళ్లూ... కడియం కావాలంటే నీటిలో మునగాలి అని చెప్పేది. పులిని నమ్మాలంటే చాలా ఇబ్బంది. ఈ పులి మంచిది కాదు కదా ? గతంలో మనల్ని అందరినీ చంపేసింది. మరలా నమ్మితే మనల్ని అందరినీ తినేస్తుంది కదా ?అని అందరూ నమ్మేవాళ్లుకాదు. కానీ పులి మాత్రం అనేది.


నేను నలభై ఏళ్ల ఇండస్ట్రీ...
నేను సీనియర్‌ మోస్ట్‌ పులి. ఈ అడవిలో నాకు నలభై ఏళ్ల ఇండస్ట్రీ ఉంది. నేను గతంలో బాగా తినేవాడిని. ఇప్పుడు మంచివాడిని అయిపోయాను. ఇప్పుడు నేను తినదల్చుకోలేదు. నా వయస్సు పెరిగింది. కాబట్టి ఎవరినీ తినదల్చుకోలేదు. రామకృష్ణా అంటూ మంచి కార్యక్రమాలు చేస్తున్నాను. నిజాలే చెబుతున్నాను అని నమ్మించేది. నమ్మించిన తర్వాత.. పులి ఇంతలా చెబుతుంది. ముసలి వయస్సు వచ్చింది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెబుతుంది కదా అని కాస్తా కూస్తో నమ్మినవాళ్లు ఆ మడుగులోకి వెళ్లి అక్కడ నీట మునిగి ఆ పులిదగ్గరకు వెల్లి కడియం తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ మడుగులోకి వెళ్లిన వెంటనే అక్కడ ఉన్న బురదతో అక్కడే ఇరుక్కునేవారు. అంతే.. వాళ్లదగ్గరకు పులి నడుచుకుంటూ చిన్నగా  వచ్చి వాళ్లను చంపి తినేసేది. 


ఈ రోజు ఈ కథ చెప్పిన నీతి.. అబద్దాలు ఆడేవారిని, వంచకుడిని, వెన్నుపోటు పొడిచేవారిని, మాయమాటలు చెప్పేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకూడదు అని ఈ కథ చెప్తుంది. ఈ కథ వింటే మనకు ఎవరు గుర్తుకువస్తారో ఆలోచన చేయండి ? 


నరమాంసానికి అలవాటుపడిన, మోసపూరిత వాగ్ధానాలు, కళ్లార్పకుండా అబద్దాలు చెప్పగలిగే నైజమున్న ఒక ముసలాయన గుర్తుకు వస్తాడు. ఎవరా ముసలాయన ? ఎవరు ? నారా  చంద్రబాబునాయుడు గుర్తుకువస్తాడు. బంగారు కడియం ఇస్తానంటాడు.


మొన్ననే టీవీ ఇంటర్యూలలో, మీటింగ్‌లో మరలా కొత్తగా వినిపిస్తున్నాడు. జాబు రావాలంటే బాబు రావాలట. ఈ మనిషికి ఎప్పూడూ బుద్దేరాదని నాకనిపించింది . గతంలో  2014లో టీవీలలో అడ్వర్టైజ్‌మెంట్‌లు కనిపించేవి. ఇంటికి వెళ్లి టీవీ ఆన్‌ చేస్తే చాలు కనిపించేవి. 


అన్నదాతలకు మోసం..
బ్యాంకులలో పెట్టిన బంగారం ఇంటికి రావాలని అంటే బాబు రావాలి. పిల్లలకు జాబు రావాలంటే బాబు రావాలి.అడ్వర్టైజ్‌మెంట్‌లు ఒక్కటే అయితే ప్రజలు నమ్మరని ఆపెద్దమనిషి అక్కడితో ఆగిపోలేదు. ఇంటింటికీ మనుషులను పంపించి.. ప్రతి ఒక్కరికీ చెప్పేవాడు. ఇదిగో అక్కా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి ఈ లేఖ పంపించాడు. జాబు రావాలంటే బాబు రావాలి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే రావాలి. ఇదిగో ఆయన గ్యారంటీ ఇస్తూ సంతకం పెట్టి పంపించారని లేఖలు ఇచ్చేవారు. 2014లో ఎన్నికలు అయిపోయాయి. తర్వాత బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. సీఎం అయిన తర్వాత రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మొట్టమొదటి సంతకంతో మాఫీ చేస్తానని చెప్పాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలని చెప్పాడు.
బాబు వచ్చాడు రైతులను నట్టేట ముంచాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం కథ దేవుడెరుగు.. ఆ బంగారాన్ని వేలం వేయడం మొదలుపెట్టారు బ్యాంకర్లు. అప్పటి దాకా సున్నా వడ్డీ కడుతున్న పరిస్థితి పోయి 2016లో సున్నావడ్డీ పథకాన్ని పూర్తిగా రద్దుచేశాడు. 


అక్కచెల్లెమ్మలనూ మోసం చేసి....
బాబు ముఖ్యమంత్రి అయ్యాడు అక్కచెల్లెమ్మలు, పొదుపు సంఘాలకు సంబంధించి రూ.14,200 కోట్ల రుణాలు మొట్టమొదటి సంతకంతో మాఫీ చేస్తానన్నాడు. ఆ బంగారం ఇంటికి రావడం మాట దేవుడెరుగు.. 2016 వరకు సున్నావడ్డీ కింద అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న పథకాన్ని రద్దు చేశాడు. జాబు రావాలంటే బాబు రావాలని మాటలు చెప్పాడు. ఒకవేళ జాబ్‌ ఇవ్వలేకపోతే, ఇంటింటికీ ఉపాధి, ఇంటింటికీ ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికీ రూ.2వేలు నిరుద్యోగభృతి ఇస్తానన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు. రాష్ట్రంలో 1.50 కోట్ల ఇళ్లు ఉన్నాయి. ప్రతి ఇళ్లూ ఎదురు చూసింది. ఉద్యోగం రాకపోయిన కనీసం నెల, నెల రూ.2వేలు నిరుద్యోగ భృతి వస్తుందని ఎదురుచూశారు. బాబు సీఎం అయ్యాడు. 60 నెలల్లో ప్రతి ఇంటికి రూ.2వేల చొప్పున రూ.1.20 లక్షలు బాకీ పడ్డాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రం 3 లక్షల మంది పిల్లలకు రూ.వేయి చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చాడు. 


అవ్వాతాలను వదిలిపెట్టలేదు. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు రూ.2వేలు అది కూడా చేయకపోతే జగన్‌ను తట్టుకోలేం అని మోసం చేస్తూ ఇచ్చాడు.


బాబు – మరలా అవే మాయమాటలు. 
గుర్తు తెచ్చుకొండి. మరలా ఈరోజు ఇదే పెద్దమనిషి ప్రజల జ్ఞాపకశక్తితో ఆడుకుంటున్నాడు. మరలా ఇదే టేప్‌ రికార్డర్‌ఆన్‌ చేస్తున్నాడు. మోసం చేసేందుకు ఇవే డైలాగులు చెప్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకు ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నానంటే.. గతానికీ ఇప్పటికీ మధ్య తేడా చూడమని అడుగుతున్నాను. గతంలో కూడా సీఎంఉండేవాడు. పాలన సాగేది. బడ్జెట్‌ ఉండేది. ఈ రోజూ అదే రాష్ట్రం. అదే బడ్జెట్‌ కేవలం తేడా ఒక్కటే.. ముఖ్యమంత్రి మారాడు. ఒక్క తేడా మాత్రమే జరిగింది. కానీ ఈ రోజు రూ. 2.08 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కగానే అక్కచెల్లెమ్మల ఖాతాల్లో పడుతున్నాయి. 


ఒక్క సింగనమల నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.1400 కోట్లు నేరుగా జమ చేశాం. తేడా గమనించండి. ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌. అప్పుడు చంద్రబాబునాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు. ఎందుకు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో ఇంత డబ్బులు ఇవ్వలేకపోయాడు. మీ బిడ్డ ఎలా ఇస్తున్నాడు. ఆలోచన చేయండి.


గతంలో డీపీటీ...
గతంలో దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) స్కీం. చంద్రబాబునాయుడు ఆయనకు తోడు ఒక గజదొంగల ముఠా. ఆ ముఠా సభ్యులు ఎవరంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5 వీళ్లందరికీ తోడు మరో దత్తపుత్రుడు. దోచుకో, పంచుకో, తినుకో ఆ రోజు పరిస్థితి. 


ఈ రోజూ డీబీటీ...
ఈ రోజు మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు. నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతున్నాయి. ఈ రోజు లంచాలు లేవు. వివక్ష లేదు. ఈ రోజు ఎవరిచూట్టూ మీరెవ్వరూ తిరగాల్సిన అవసరం లేకుండా.. వాలంటీర్‌ నేరుగా మీ ఇంటికి వచ్చి మీకు మంచి చేసే రోజులు వచ్చాయి. తేడా గమనించండి.


ఎందుకు ఇవన్నీ చెపుతున్నానంటే... రాబోయే రోజుల్లో ఇవన్నీ ఇంకా ఎక్కువ అవుతాయి. అబద్ధాలు చెప్పడం ఇంకా అవుతాయి. మోసాలు చేయడం ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది.  మీరంతా ఆలోచన చేయండి. మీరందరిని కోరేది ఒక్కటే.
ఈ అబద్దాలను, మోసాలను నమ్మకండి. 


ఒక్కటే కొలమానం....
కేవలం ఒక్కటే ఒకటి కొలమానంగా తీసుకొండి. మీ ఇంట్లో మీ జగనన్న వల్ల మీకు మంచి జరిగిందా ? లేదా ?అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకొండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ జగనన్నకు మీరే సైనికులు కండి. ఎందుకంటే మీ జగనన్నకు తోడుగా ఈనాడు లేదు. ఆంధ్రజ్యోతి లేదు. టీవీ 5 లేదు. దత్తపుత్రుడు లేడు.


నా ధైర్యం మీరే.... 
మీ జగనన్న వీళ్లనెవ్వరినీ నమ్ముకోలేదు. మీ జగనన్న నమ్మకుంది ఆ దేవుడి దయను, మిమ్మల్ని మాత్రమే. నా ధైర్యం మీరే. నా ఆత్మ విశ్వాసం మీరే. నా నమ్మకం మీరే.
రాబోయే రోజుల్లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీ అందరితోడు మీ జగనన్నకు రావాలని, దేవుడి చల్లని దీవెనలు, ఆశీస్సులతో ప్రజలకు ఇంచా మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నాను. 


చివరిగా... 
కాసేపటి క్రితం నా చెల్లి (శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి) నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులకోసం అడిగింది. చాగల్లు రిజర్వాయరుకు సంబంధించి... దశాబ్దాలుగా మునక ప్రాంతంలో ఉన్న ఉల్లికంటిపల్లె ప్రాంతాలను పట్టించుకోని పరిస్థితిని మార్చమని అడిగింది. దీనికోసం ఆర్‌ ఆండ్‌ ప్యాకేజీ కోసం రూ. 168 కోట్లు అవుతుంది. నా చెల్లికోసం ఇది చేస్తాను. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల కోసం ఈస్ట్‌ నారాయణపురం గ్రామంలో రూ.35 కోట్లు ఖర్చువుతుందన్నారు. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. శింగనమలలో అంబేద్కర్‌ భవన్‌ను కూడా మంజూరు చేస్తున్నాం. మిడ్‌ పెన్నార్‌ నిర్వహణ కోసం, సౌత్‌ కెనాల్‌ ఆధునీకరణకోసం రూ.3 కోట్లు ఖర్చువుతుందని అడిగింది. అది ఇస్తే రైతులకు మేలు జరుగుతుందని అడిగింది. అది కూడా మంజూరు చేస్తున్నాం. నార్పల్లిలో బాలికల హైస్కూల్‌ .. భూసేకరణకు రూ.1కోటి ఖర్చవుతుందని అడిగింది. అదీ మంజూరు చేస్తున్నాం. ‡ఈ నియోజకవర్గానికి సంబంధించి చిత్రావతి నది మీద రెండు బ్రిడ్జిలు కావాలని అడిగింది. వాటిని కూడా మంజూరు చేస్తున్నాం. మరో ముఖ్యమైనది కూడా మంజూరు చేస్తున్నాం. గండికోట నుంచి సుబ్రమణ్యసాగర్‌ ప్రాజెక్టు పుట్లూరు మండలానికి తాగునీరిచ్చే కార్యక్రమం.. తాగునీటి పైప్‌లైన్‌ కోసం రూ.250 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ మధ్య కాలంలో డీపీఆర్‌ పూర్తయింది. దీన్ని మంజూరు చేయాలని అడిగింది. మరో మూడు నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెడతాం.  అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, ఆశిస్తున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.