Chukkala Bhoomulu Rights: చుక్కల భూముల రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కారు
Chukkala Bhoomulu Rights in AP: అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో నేడు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Chukkala Bhoomulu Rights in AP: అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో నేడు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
అసలు ఈ చుక్కల భూములు అంటే ఏంటంటే..
బ్రిటీష్ కాలంలో సుమారు వంద సంవత్సరాల క్రితం భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ భూమి‘ లేదా ‘ప్రైవేటు భూమి‘ అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డులలో (రీ సెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్‌ఎస్‌ఆర్) పట్టాదారు గడిలో ఏమని రాయాలో అర్థం కాని పరిస్థితుల్లో "చుక్కలు" పెట్టి వదిలేశారు. సదరు భూములే ఇప్పటికీ రికార్డులలో "చుక్కల భూములు" గా మిగిలిపోయాయి.
చుక్కల భూములతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే..
దశాబ్దాలుగా రైతులు ఆ భూములలో వ్యవసాయం చేసుకుంటూ అనుభవిస్తున్నప్పటికీ.. పట్టాదారు గడిలో చుక్కలు చూపిస్తుండటంతోపై ఆ భూములపై హక్కులు లేక, అత్యవసరంలో అమ్ముకునే స్వేచ్ఛ లేక ఇబ్బంది పడుతున్న దుస్థితి నెలకొంది.
ఇదిలావుండగానే, మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా.. రైతులకు మరింత ఇబ్బంది కలిగేలా 2016లో ఈ భూములన్నింటిని అప్పటి ప్రభుత్వం ఒక్క కలం పోటుతో నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. చుక్కల భూములనే నమ్ముకున్న రైతులకు ఇది మరింత కోలుకోలేని దెబ్బగా మారింది. ఈ పరిస్థితిని సమూలంగా మారుస్తూ ప్రతి రైతన్న కుటుంబానికి మేలు జరగాలని, వారి ఆస్థిపై సర్వ హక్కులు వారికే చెందాలని రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ రైతన్నలు తిరిగే అవసరం లేకుండా, వారికి ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా దశాబ్దాల కాలం నాటి ఈ చుక్కల భూముల సమస్యలకు పరిష్కారం చూపుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది.
దాదాపు లక్ష మంది రైతన్నల కుటుంబాలకు రూ.20,000 కోట్ల లబ్ది..
సంవత్సరాల తరబడి తమ స్వాధీనంలో ఉండి కూడా ఏ అవసరాలకు (క్రయవిక్రయాలు, రుణం, తనఖా, వారసత్వం, బహుమతి మొదలగు) వాడుకోలేని దుస్థితి నుంచి వారి వారి భూములకు వారిని పూర్తి హక్కుదారులను చేస్తూ నేడు సుమారు 97,471 కుటుంబాలకు దాదాపు రూ. 20,000 కోట్ల మేర లబ్ది చేకూర్చేందుకు సీఎం వైఎస్ జగన్ నడుం బిగించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 2,06,171 ఎకరాల భూములను నిషేధిత భూముల జాబితాలోంచి తొలగించడంతో పాటు ఆయా రైతులకు సర్వ హక్కులు కలగనున్నాయి.
ఇప్పటివరకు జగన్ సర్కారు రెవెన్యూ విభాగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు ఏంటంటే..
తమ పార్టీ అధికారంలోకి వచ్చాకా ఇప్పటికే సుమారు 22,000 మంది పేద రైతన్నలకు మేలు జరిగేలా నిషేధిత భూముల జాబితా నుండి సుమారు 35,000 ఎకరాల " షరతులు గల పట్టా భూముల" పై ఆంక్షలు లేకుండా చేసి ఆయా రైతులకు మేలు చేయడం జరిగింది అని ఏపీ సర్కారు ప్రకటించింది. అంతేకాకుండా, దేశంలోనే మొదటి సారిగా అనేక రకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో వందేళ్ల తర్వాత చేపట్టిన " వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష " ద్వారా ఇప్పటివరకు 2000 గ్రామాల్లో 7,92,238 కి పైగా భూహక్కు పత్రాలు రైతులకు అందించడం జరిగిందని ఏపీ సర్కారు తమ ప్రకటనలో పేర్కొంది. భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కరించాలనే దృక్పథంతో డిసెంబర్ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలో ఉన్న మొత్తం 17,584 గ్రామాలు, పట్టణాల్లో భూముల రీసర్వే చేసి ఆయా భూముల హక్కుదారులకు శాశ్వత భూహక్కుపత్రాల జారీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఏపీ సర్కారు స్పష్టంచేసింది.
ఇప్పటికే దాదాపు 1,27,313 మంది గిరిజనులకు సుమారు 2.83 లక్షల ఎకరాల అటవీ భూములపై హక్కుపత్రాల పంపిణీ చేయడం... అలాగే, పేద గిరిజనులు అందరికీ కనీసం 2 ఎకరాల భూమి కేటాయించి ఆ కుటుంబంలోని మహిళల పేరున పత్రాలు జారీ చేయడం జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే దాదాపు 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇళ్లు లేని వారికి ఇళ్లు కూడా నిర్మించి ఇస్తున్నట్టు ఏపీ సర్కారు స్పష్టంచేసింది. రెవెన్యూ సంబంధిత సమస్యలు, సలహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1902 లో సంప్రదించాల్సిందిగా సర్కారు సూచించింది.