అమరావతి: సున్నా వడ్డీ పథకంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజుకున్న మాటల యుద్ధం ఏపీ అసెంబ్లీలో రభసకు దారితీసింది. చర్చ జరిగే క్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం సభలో టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తడంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మరోసారి పరస్పర విమర్శలకు దిగారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ  'మీరు 23 మంది ఉన్నారు.. కానీ మావాళ్లు 151 మంది ఉన్నారని, మా వాళ్లంతా ఒక్కసారిగా లేచినిలబడితే మీరు మీ స్థానాల్లో ఉండలేరు' అని హెచ్చరించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : ఏపీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించిన చంద్రబాబు


వైఎస్ జగన్ వ్యాఖ్యలపై అసెంబ్లీలోనే స్పందించిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు సభలో తీవ్ర గందరగోళం జరిగిన తర్వాత ఆరేడు మంది వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడారని, అటువంటప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం తరపున తమ గొంతు వినిపించే హక్కు తమకు ఉందన్నారు. అధికార పార్టీ విమర్శలు చేసినప్పుడు.. ప్రతిపక్షం చెప్పిన సమాధానం కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి అవకాశం లేనప్పుడు బయట మాట్లాడతామని అన్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో సంఖ్యాపరంగా మీ(ప్రతిపక్షం) సంఖ్య తక్కువగా ఉందని, మేం తలచుకుంటే ఏమౌతారని సీఎం జగన్ అంటున్నారని.. ఇది ఎంతవరకు సబబని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదు అధ్యక్షా అని చంద్రబాబు అన్నారు.