అమరావతి : మీడియాకు ఇటీవల కాలంలో ఎటువంటి నియంత్రణ లేకుండాపోయిందని ఏపీ డీజీపి గౌతం సవాంగ్ ( AP DGP Gautam Sawang ) అసహనం వ్యక్తంచేశారు. ఎలక్ట్రానిక్ మీడియా ( Electronic media ), ప్రింట్‌ మీడియా ( Print media ), సోషల్‌ మీడియాలో ( Social media ) ఎటువంటి నియంత్రణ లేకుండా ఏదో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ప్రచురిస్తున్న వార్తలు, వ్యాఖ్యల వల్ల సమాజంలో హింస చెలరేగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. మాధ్యమాలన్నీ చట్టం పరిధిలో నియంత్రణ పాటించాలని సూచిస్తూ ఏపీ డీజీపీ పలు సూచనలు జారీచేశారు. ఈ మేరకు ఏపీ డీజీపి కార్యాలయం ( AP DGP Office ) నుంచి ఓ పత్రికా ప్రకటన వెలువడింది. అందులోని ముఖ్యాంశాలు..
 
1) ఈ మధ్య కాలంలో మీడియా (ఎలక్ట్రానిక్, ప్రింట్‌, సోషల్‌ మీడియా)లో నియంత్రణ లేకుండా రెచ్చ గొట్టే విధంగా ప్రచురిస్తున్న వార్తలు/ వ్యాఖ్యల వల్ల సమాజంలో అలజడి రేగుతోంది. పరిస్థితులు వ్యక్తిగత దూషణల నుండి మొదలై వైషమ్యాల వైపునకు దారితీస్తున్నాయి. ఫలితంగా అశాంతి వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు సమాజానికీ, వ్యవస్థకూ మంచిదికాదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2) ఇట్టి పోకడలను అరికట్టే క్రమంలో పోలీసు శాఖ ఈ మధ్య కాలంలో శాఖా పరమైన వ్యవస్థలను పటిష్టం చేసుకుంటోంది. సీఐడీ విభాగంలోని సైబర్‌ క్రై మ్‌ విభాగంలో సోషల్‌ మీడియా నేరాల నియంత్రణ, పర్యవేక్షణకు ప్రత్యేకంగా మరో విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే పలు ఫిర్యాదులు రావడం, వాటి దర్యాప్తు వేగవంతం చేయడం జరుగుతూ ఉంది. 


3) అదే విధంగా మాధ్యమాలలో రాజ్యాంగ బద్ద సంస్థల పట్ల, ఆ సంస్థల నిర్వహణలో ఉన్న వ్యక్తుల పట్ల వ్యాఖ్యలు చేయడం, వాటిని ఇష్టం వచ్చినట్టు అన్వయించుకోవడం సరికాదు. ప్రచురించే, ప్రసారంచేసే సమాచారంలో, అభిప్రాయాల వ్యక్తీకరణలో చట్టాలను అనుసరించాలి. వక్రీకరణ, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఇవ్వడం, ఊహాజనిత అంశాలను ప్రసారంచేయడం, ప్రచురించడం, అశ్లీల, అసభ్యకర, నిందపూర్వక, అభ్యంతరకర వ్యాఖ్యానాలు చేయడం గర్హనీయం. ఈ విషయంలో చట్ట ప్రకారం వ్యవహరిస్తామని పునరుద్ఘాటిస్తున్నాం. పోలీసు శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి వ్యక్తులను ఉపేక్షించదు. నిష్ఫక్షపాతంగా ముందుకు వెళ్తాం. 


4) ఇటీవల గౌరవ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పట్ల, వారి తీర్పుల పట్ల కొందరు చట్టాన్ని అతిక్రమించి వ్యాఖ్యలు చేశారన్న విషయంలో హై కోర్ట్‌ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు వేగవంతం చేసాం. అలాగే ప్రభుత్వం మీద, ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తులమీద కూడా తప్పుడు ప్రచారాలు, అవాస్తవాలు ప్రచారంచేసి ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్ననిస్తున్నారు. వీటన్నింటిమీద పోలీసుల కన్ను ఉంది. 


5) మనం పరిణితి చెందిన సమాజంలో ఉన్నామని విషయాన్ని అందరూ గుర్తించాలి. ప్రజాస్వామ్య యుతంగా, రాజ్యాంగ పరంగా ఏర్పడ్డ సంస్థల  గౌరవానికి, వ్యవస్థల గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించరాదని మరోసారి హెచ్చరిస్తున్నాం.


6) ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచురుణలు, ప్రసారాలు చేసేవారు, అభిప్రాయలు వ్యక్తీకరించేవారు నియంత్రణ పాటించక పోతే అట్టి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం


ఏపీ సర్కార్‌పై, ఏపీ హై కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఇటీవల కొంతమంది చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఏపీ డీజీపి మీడియాకు ఈ హెచ్చరిక చేశారని ఈ పత్రికా ప్రకటనను చూస్తే అర్థమవుతోంది.