సీబీఐకి ఇక ఏపీలో దర్యాప్తు చేసే అధికారం లేదు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టకూడదని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరిస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టకూడదని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరిస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్గత విభేదాల కారణంగా సీబీఐ వివాదాల చుట్టూ నడుస్తుందని.. ఇలాంటి సమయంలో ఏపీలో సీబీఐ అధికారులు అడుగుపెట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఏపీ సర్కారు తెలిపింది. ఏదైనా కేసు విషయంలో ఎంక్వయరీ చేయడానికి గానీ లేదా రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగులను ప్రశ్నించే విషయంలో గానీ సీబీఐ చొరవ చూపించాలంటే అందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలి.
అయితే.. అలాంటి అనుమతిని ఇకపై సీబీఐకి తాము ఇవ్వడం లేదని.. సీబీఐ అధికారులు ఏపీలో అడుగు పెట్టవద్దని ఏపీ సర్కారు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సీబీఐ ఏ రాష్ట్రంలోనైనా తన అధికారాలను వినియోగించుకోవాలంటే.. తొలుత ఆయా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ అనుమతిని ఇవ్వాలి. కానీ ఇకపై సీబీఐకి ఆ సౌలభ్యాన్ని తాము కలిగించడం లేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కేసులను దర్యాప్తు చేసే అవకాశం సీబీఐకి ఉండదు కాబట్టి.. ఇక ఎలాంటి నేరాలకు సంబంధించిన దర్యాప్తులనైనా రాష్ట్ర దర్యాప్తు సంస్థ ఏసీబీ మాత్రమే నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని కేంద్రప్రభుత్వ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంస్థలకు సంబంధించిన అవినీతి కేసులను కూడా ఇకపై తాజా ఉత్తర్వుల ప్రకారం ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఇప్పటికే మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంపై కక్షతో కేంద్రం రాష్ట్రంలో సీబీఐ అధికారుల చేత దాడులు చేయించడమే పనిగా పెట్టుకుందని.. అందుకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ తాజా ఉత్తర్వులని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.