Security Bonds Auction: వారంలో రెండోసారి, హామీల అమలుకు 7 వేల కోట్ల బాండ్ల అమ్మకాలు
Security Bonds Auction: ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అప్పుడే కష్టాలొచ్చిపడుతున్నాయి. ఇచ్చిన భారీ హామీల అమలుకు నిధుల సేకరణ ప్రారంభించింది. వేలకోట్ల బాండ్లను విక్రయానికి పెట్టింది.
Security Bonds Auction: ఏపీలోని కూటమి ప్రభుత్వానికి అప్పుడే పురిటి కష్టాలు మొదలైనట్టున్నాయి. ఇచ్చిన హామీల్ని అమలు చేసేందుకు డబ్బులు ఎక్కడ్నిచి తీసుకురావాలో తెలియక ప్రభుత్వ ఆస్థుల విక్రయం మొదలెట్టేసింది. ప్రభుత్వానికి సంబంధించిన బాండ్లను వేలానికి పెట్టింది.
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించి అధికారంలో వచ్చిన చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఇచ్చిన భారీ హామీల అమలు ఓ సవాలుగా మారింది. అధికారం కోసం సూపర్ సిక్స్ అంటూ భారీగా నిధులు అవసరమయ్యే పథకాలకు శ్రీకారం చుట్టింది. అందుకే నిధుల కోసం ప్రభుత్వ ఆస్థులైన బాండ్లను అమ్మకానికి పెట్టింది. వారం రోజుల వ్యవధిలో ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టడం ఇది రెండవసారి. వారం రోజుల క్రితం 1000 కోట్ల చొప్పున రెండు బాండ్లను వేలం ద్వారా విక్రయించింది. మొన్న అంటే జూన్ 25న ఆ వేలం ప్రక్రియ కూడా పూర్తయింది. ఇప్పుడు మరో 5 వేల కోట్ల సమీకరణకు బాండ్లు వేలానికి పెట్టింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ద్వారా వేలం పాట జరగనుంది. కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో ఈ వేలం ప్రక్రియ జరగనుంది. 1000 కోట్ల రూపాయలు విలువ చేసే 5 సెక్యూరిటీ బాండ్లను అమ్మకానికి పెట్టింది. ఈ బాండ్ల కాల వ్యవధి పరిశీలిస్తే ఒకటి 9 ఏళ్లుంటే రెండవది 12, మూడోది 17, నాలుగోది 21, ఐదవది 24 ఏళ్లుంది. రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగే ఈ బాండ్ల వేలం ప్రక్రియలో ఎవరైనా పాల్గొనవచ్చు. జూలై 2వ తేదీన బాండ్ల వేలం జరగనుంది.
బాండ్లు వేలం పెట్టిన ఇతర రాష్ట్రాలు
ఏపీతో పాటు మరో 8 రాష్ట్రాలు కూడా బాండ్లు వేలానికి పెట్టాయి. ఇందులో జమ్ము కశ్మీర్ 500 కోట్లు, కేరళ 1500 కోట్లు, మణిపూర్ 200 కోట్లు, మేఘాలయ 400 కోట్లు, పంజాబ్ 2500 కోట్లు, తమిళనాడు 2000 కోట్ల సెక్యూరిటీ బాండ్లు విక్రయిస్తున్నారు. తెంలగాణ సైతం ఆదాయ వనరుల సమీకరణకు సెక్యూరిటీ బాండ్ల వేలంపైనే ఆధారపడింది. 2 వేల కోట్ల రూపాయల విలువ చేసే బాండ్లు వేలానికి పెట్టింది. దేశవ్యాప్తంగా మొత్తం 14,100 కోట్ల రూపాయల విలువ చేసే బాండ్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 2న వేలం వేయనుంది.
Also read: AP Rains Alert: బలపడిన ద్రోణి, రుతు పవనాలు, ఏపీలో భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook