Global Investors Summit 2023: ఒక వేదిక రెండు లక్ష్యాలు. విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు విశాఖ రాజధాని వాదనను విస్తృతం చేయడం. రెండింట్లోనూ ఏపీ ప్రభుత్వం సక్సెస్ అయిందన్పిస్తోంది. కేంద్రమంత్రుల నోట కూడా విశాఖ రాజధాని మాట రావడమే ఇందుకు కారణం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సక్సెస్ అయింది. అంబానీ, అదానీ, బిర్లా తదితర దేశ విఖ్యాత దిగ్గజాలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల వర్షం కురిపించారు. రెండ్రోజుల సదస్సులో రాష్ట్రంలో 353 ఎంవోయూల ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ప్రభుత్వ అంచనాలను మించి సమ్మిట్ సక్సెస్ అయింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, శర్బానంద్ సోనోవాల్ తదితరులు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. భారీగా పెట్టుబడులు రావడంపై శుభాకాంక్షలు తెలిపారు. 


ఈ సమ్మిట్ ద్వారా ఏపీ ప్రభుత్వం పెట్టుబడులతో పాటు విశాఖ రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకురావాలనుకుంది. ప్రభుత్వ ఆలోచన సక్సెస్ అయింది. ప్రభుత్వం ఊహించిన రెండు లక్ష్యాల్ని చేరుకుంది. భారీగా పెట్టుబడులు వచ్చేశాయి. అదే సమయంలో విశాఖ రాజధాని వాదనను దేశ విఖ్యాత పారిశ్రామిక వేత్తల సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించడమే కాకుండా..ఈ వాదనకు విస్తృత ప్రచారం కల్పించారు. కేంద్ర మంత్రుల ప్రసంగాల్లో సైతం విశాఖ రాజధాని అంశం అలవోకగా వచ్చేసింది. ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖను పరిచయం చేసిన జగన్..ఆ అంశంలో విజయం సాధించారు. అందుకే అందరి నోటి నుంచి విశాఖ రాజధాని ప్రస్తావన పదే పదే వచ్చింది. 


ఓ వైపు ఇదే అంశమై సుప్రీంకోర్టులో విచారణ పెండింగులో ఉంది. ఈ నెల 28వ తేదీన విచారణ జరగనుంది. అదే సమయంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సాక్షిగా చేసిన విశాఖ నుంచి త్వరలో పరిపాలన ప్రారంభం కానుందని, తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానని సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పడం గమనార్హం. రాజధాని విశాఖ విషయంలో ఏపీ ప్రభుత్వ వాదన నిజమయ్యేలా కన్పిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు రాకుండానే దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, కేంద్ర మంత్రుల సాక్షిగా విశాఖ రాజధాని ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. 


అదే సమయంలో పెట్టుబడుల్లో కూడా అగ్రస్థానం విశాఖకు కేటాయించడం కూడా వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. విశాఖ-భోగాపురం ఆరు లైన్ల జాతీయ రహదారికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలుపడం కూడా ప్రభుత్వ వాదనకు బలం చేకూరుస్తోంది. 


Also read: GIS 2023 Updates: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ భారీ సక్సెస్, 353 ఎంవోయూలు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook