అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపి తీర్థం పుచ్చుకున్న ఘటన నుంచి ఆ పార్టీ ఇంకా కోలుకోకముందే.. తాజాగా చంద్రబాబు పార్టీకి చెందిన వస్తుసామాగ్రి నిల్వ చేసి వున్న ప్రజా వేదికను ఏపీ సర్కార్ ఖాళీ చేయించింది. చంద్రబాబు నివాసానికి ఆనుకుని వున్న ప్రజావేదికలో టీడీపితోపాటు చంద్రబాబుకు చెందిన వస్తు, సామాగ్రి నిల్వచేసి వున్నట్టు తెలుస్తోంది. ఇంతకాలంపాటు అందులో వున్న ఆ వస్తు సామాగ్రిని స్థానిక ఆర్డీఓ అందులోంచి ఖాళీ చేయించి బయటపెట్టించారు. ఏపీ సర్కార్ ఆదేశాల మేరకు త్వరలోనే ప్రజా వేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.. అందులో భాగంగానే ప్రజా వేదికలో వున్న వస్తుసామాగ్రిని బయటకు తీసుకొచ్చారు. 


ఇదిలావుంటే, మరోవైపు చంద్రబాబు విదేశీ పర్యటనలో వున్న సమయంలో ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం కక్షపూరితమైనదేనని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రజావేదిక వద్దకు చేరుకున్న టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అందులో వున్న వస్తుసామాగ్రిని ఇలా బయటపడేస్తే ఎలా అని అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా టీడీపి శ్రేణులు ప్రజా వేదిక ఎదుట ఆందోళన నిర్వహించాయి. అయితే, టీడీపి నేతలు చేస్తోన్న ఆందోళనపై స్పందించిన స్థానిక ఆర్డీఓ.. నియమనిబంధనల మేరకు తాము నోటీసులు జారీ చేశామని.. అయినప్పటికీ వారి నుంచి స్పందన కనిపించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.