చంద్రబాబు సర్కార్ ఏపీలో ఇంధన ధరలను తగ్గించాలని యోచిస్తోంది. వాహనదారులకు ఊరటనిస్తూ.. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించాలని ప్లాన్ చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్నిరోజులుగా పెట్రోల్ ధరల పెరుగుతున్నాయి. ఇవాళ కూడా ఇంధన ధరలు పెరిగాయి. దీనిపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలు రోడ్లమీదికొచ్చి పెట్రోల్ పెంపును నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దాంతో ముఖ్యమంత్రి ఇంధన ధరలపై వ్యాట్‌ను తగ్గించాలని నిర్ణయించారు.


సోమవారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ.. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోని తన గదిలో ఈ అంశంపై అధికారులతో చర్చిస్తున్నారు. చంద్రబాబు నాయుడు త్వరలో అసెంబ్లీలో ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.


పెట్రోల్, డీజిల్ రెండింటిపై రాష్ట్రంలో ప్రస్తుతం రూ.4 వ్యాట్ ఉంది. ఇది రెగ్యులర్ పన్నులకు అదనం. కానీ, చంద్రబాబు ప్రజలపై ఎంత భారం తగ్గిస్తారో తెలియరాలేదు.


స్థానిక మీడియా కథనాల మేరకు.. చంద్రబాబు సర్కార్  పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై 2 శాతం మేర పన్నును తగ్గించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకోనున్న ఈ నిర్ణయం వల్ల రూ.1120 కోట్ల మేర ఆదాయం కోల్పోనుంది.  


పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఉపశమనం ఇవ్వడానికి చర్యలు చేపట్టుతున్నారని నివేదికలు తెలిపాయి.


ఇదిలా ఉండగా.. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ 25పైసలు పెరిగి రూ.85.60 గా ఉండగా.. విజయవాడలో 6 పైసలు తగ్గి రూ.86.72గా ఉంది.


 రాజస్థాన్‌‌లో పెట్రోలు, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌)ను నాలుగు శాతం తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో చమురు ధరలు లీటరుకు రూ.2.5 వరకూ తగ్గనున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో కూడా ప్రజలపై భారం పడకుండా అక్కడి ప్రభుత్వాలు ఇంధన ధరలపై వ్యాట్‌ను తగ్గించే చర్యలు తీసుకుంటున్నాయి.