Manipur Violence News: అమరావతి: మణిపూర్‌లో శాంతి భద్రతల సమస్య తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విద్యార్థులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టిన ఏపీ సర్కారు.. అందులో భాగంగానే మాజీ ఐఆర్ఎస్ అధికారి మైఖేల్‌ అంఖమ్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అధికారులు.. మణిపూర్ లో చిక్కుకున్న వారి సహాయార్థం 011-23384016, 011-23387089  హెల్ప్ లైన్ నంబర్లకు డయల్ చేయాల్సిందిగా ప్రకటించారు. మణిపూర్ లో సహాయం కోసం అక్కడి ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్లు అయిన 8399882392 , 9436034077, 7085517602 లను సంప్రదించవచ్చని సూచించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ సర్కారు తరపున ఏపీ భవన్ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. మణిపూర్‌లోని వివిధ యూనివర్సిటీల్లో ఏపీకి చెందిన దాదాపు 150 మంది విద్యార్థులు ఉన్నత విధ్యను అభ్యసిస్తున్నట్టు ఏపీ సర్కారు వద్ద ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. వారి రక్షణ కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని.. అవసరమైతే ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి అయినా వారిని సురక్షితంగా ఏపీకి రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఏపీ సర్కారు వెల్లడించింది.


మణిపూర్ రాష్ట్రంలో గిరిజన తెగల మధ్య రిజర్వేషన్ విషయమై ఏర్పడిన ఘర్షణలు హింసాత్మక ఘర్షణలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ దాడుల్లో 54 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారుల దాడుల్లో భారీ మొత్తంలో ఆస్తి నష్టం సంభవించింది. అనేక జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. హింసాత్మక ఘటనలను నియంత్రించడానికి కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందా అని అక్కడున్న విద్యార్థులు, ఇక్కడున్న వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.