చిరు పార్టీ హోల్ సేల్ .. పవన్ పార్టీ రిటైల్ సేల్ - మంత్రి జవహర్ హాట్ కామెంట్స్
టీడీపీయే ప్రధాన టార్గెట్ గా విరుచుకుపడుతన్న పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పై మంత్రి జవహర్ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్ బీజేపీకి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని ఎదరించాలని పవన్ కు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని హోల్ సేల్ గా కాంగ్రెస్ కు అమ్మితే..పవన్ జనసేన పార్టీని బీజేపీకి రిటైల్ గా అమ్ముతున్నారని ఎద్దేవ చేశారు.
జగన్ జేబులో బీజేపీ జెండా..
ఈ సందర్భంగా మంత్రి జవహర్ ఏపీ ప్రతిపక్షనేత జగన్ పై కూడా విమర్శలు సంధించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని చెబుతున్న ప్రతిపక్ష నాయకుడు జగన్... తనతో వస్తే తన సొంత డబ్బులతో ఆయనకు రాష్ట్రం మొత్తం తిప్పి జరిగిన అభివృద్ధిని చూపెడతానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అభివృద్ధి పై అసత్య ఆరోపణలు చేస్తున్న వారు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. వాస్తవం చెప్పాలంటే వైసీపీ చీఫ్ జగన్ తన జేబులో బీజేపీ జెండాను పెట్టుకొని తిరుగుతున్నారని ఈ సందర్భంగా మంత్రి జవహర్ విమర్శలు సంధించారు.
కన్నాకు బస్తీమే సవాల్
ఏపీ సర్కార్ పై పనిగట్టుకొని మరి విమర్శలకు దిగుతున్న ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి జవహకర్ విమర్శలు సంధించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేని కన్నా తమ అధినేత చంద్రబాబుపై విమర్శించే అర్హత లేదన్నారు. ముందు తన స్థానంలో గెలిచిచూపించాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏపీలో ఒక్కసీటు గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని..కన్నాకు దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని మంత్రి జవహర్ కోరారు.