మూడు రాజధానుల అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తోంది. త్రీ కేపిటల్స్ విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి  తగ్గడం లేదు. దీంతో పరిణామాలన్నీ గందరగోళంగా తయారయ్యాయి. నిన్నటికినిన్న ఆంధ్రప్రదేశ్ శాసన సభలోనూ మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు కూడా ఆమోదం పొందింది.  విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే  ఉత్సవాలు అక్కడే నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. ఇందుకు తగినట్లుగా విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాట్లు చేయాలని  ఏపీ సర్కారు కూడా సూచించినట్లు వార్తలు వచ్చాయి. 
విశాఖ నుంచి వీలైనంత త్వరగా పరిపాలన ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతున్న జగన్ సర్కారు.. గణతంత్ర దినోత్సవాన్ని అక్కడే నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐతే దీనికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు జరిగాయి. మరోవైపు శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రిపబ్లిక్ డే ఉత్సవాలపై జగన్ ప్రభుత్వం కాస్త వెనకడుగు వేసింది. గణతంత్ర దినోత్సవాల నిర్వహణ విషయంలో నిర్ణయం మార్చుకుంది. ఈసారికి విజయవాడ లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాట్లు నిలిపివేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


Read Also: ఘనంగా గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు