ఏపీ రాజధాని మార్పుపై స్పందించిన స్పీకర్ తమ్మినేని
ఏపీ రాజధాని మార్పుపై స్పందించిన స్పీకర్ తమ్మినేని
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి మరొక చోటికి మార్చుతున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రాజధాని మార్పు విషయంలో వినిపిస్తున్న మాటలన్ని అపోహలేనని ఆయన కొట్టిపారేశారు. బుధవారం స్పీకర్ తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిని మారుస్తామని ముఖ్యమంత్రి ఏమైనా ప్రకటించారా ? అని ఎదురు ప్రశ్నించారు. శివరామకృష్ణ కమిటీ చెప్పిన నివేదికనే మంత్రి వెల్లడించారు కానీ అదేమీ ప్రభుత్వ అభిప్రాయం కాదని స్పీకర్ తమ్మినేని అభిప్రాయపడ్డారు.
ఏపీ మాజీ స్పీకర్ కోడెల వివాదంపై తమ్మినేని స్పందిస్తూ.. అదొక దురదృష్టకరమైన ఘటనగా అభివర్ణించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ అదొక మాయని మచ్చగా మిగిలిపోతుందని ఒకింత అసహనం వ్యక్తంచేశారు. ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేని ప్రోద్బలంతోనే తనపై అక్రమ కేసులు బనాయించారని మాజీ విప్ కూన రవికుమార్ చేసిన ఆరోపణలపై తమ్మినేని స్పందిస్తూ.. కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఒక్క పౌరుడితో అనిపించినా తాను తన పదవి నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని... చట్టం తన పని తను చేసుకుపోతుందని అన్నారు.