స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని బ్రాండ్ యాపిల్. ఈ సంస్థ అందించే ఉత్పత్తులకి వున్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనేమో! ప్రతీ ఏడాది ఓ కొత్త మోడల్‌ని మార్కెట్‌లో ప్రవేశపెట్టడం యాపిల్‌కి ఆనవాయితీ అయితే, ఆ మోడల్‌ని కొనుక్కోవాలనుకునేవాళ్లు.. తెల్లవారక ముందే వెళ్లి స్టోర్ల ముందు క్యూ కడుతుంటారు. అదీ యాపిల్ ఉత్పత్తులకి వున్న క్రేజ్. అలాంటి స్మార్ట్ ఐఫోన్లు గత కొద్దిరోజులుగా ఓ పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఫోన్ వినియోగిస్తోంటే వేగం తగ్గుతోందనేది యాపిల్‌కి ఎక్కువగా అందిన ఫిర్యాదు. మెసేజింగ్ యాప్స్‌లో నెటిజెన్స్ చేసే చాటింగ్స్, కామెంట్స్ రూపంలోనే ఏదో తెలియని మిస్టరీ అక్షరం ఒకటి ఐఫోన్లు స్తంభించిపోవడానికి కారణమని కనుక్కొన్న పరిశోధకులకి ఆ అక్షరం ఏంటో తెలిసి ఖంగు తిన్నారు. ఎందుకంటే ఆ అక్షరం ఇంకేదో కాదు.. అచ్చ తెలుగు అక్షరం 'జ్ఞా'.


అవును, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యాపిల్ ఉత్పత్తులని ఈ జ్ఞా అనే అక్షరం క్రాష్ చేసిందని తెలుసుకున్న పరిశోధకులు ఇకపై తాత్కాలికంగా ఆ అక్షరాన్ని అనుమతించకుండా చేసి, దాని వెనుకున్న సమస్య ఏంటో కనుక్కునే పనిలో నిమగ్నమయ్యారు. అన్నట్టు ఈ 'జ్ఞా' అనే అక్షరం యాపిల్ ఉత్పత్తులని పెట్టిన ఇబ్బంది చూసిన ఫేస్‌బుక్ కూడా వెంటనే అప్రమత్తమైందండోయ్!! అందుకే యూజర్స్ చేసే పోస్టుల్లో ఫేస్‌బుక్ కూడా 'జ్ఞా' అనే అక్షరాన్ని అనుమతించడం లేదు. కావాలంటే మీరూ ట్రై చేయండి. సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే దీనినే 'బగ్' అని కూడా అంటుంటారు.