సమ్మె సైరన్ మోగించిన ఆర్టీసి జేఏసి
ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం గురువారం జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 13 నుంచి సమ్మెకు వెళ్లేందుకే నిర్ణయించుకున్నట్టు కార్మికుల సంఘం జేఏసి నేతలు తెలిపారు.
అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం గురువారం జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 13 నుంచి సమ్మెకు వెళ్లేందుకే నిర్ణయించుకున్నట్టు కార్మికుల సంఘం జేఏసి నేతలు తెలిపారు. కార్మికుల డిమాండ్లపై యాజమాన్యం నుంచి ఎటువంటి హామీ లభించనందునే తప్పనిసరి పరిస్థితుల్లో తాము సమ్మె చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. కార్మికుల వేతనాల సవరణ, బకాయిల చెల్లింపు, అద్దె బస్సుల పెంపు, సిబ్బంది కుదింపు వంటి సమస్యలతో పాటు మొత్తం 26 డిమాండ్లను యాజమాన్యం ముందుంచగా.. ఆయా సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం ఆసక్తి కనబర్చలేదని జేఏసీ తేల్చిచెప్పింది.
యాజమాన్యంతో మూడు గంటలకుపైగా చర్చలు జరిగినా... యాజమాన్యం వైపు నుంచి సరైన స్పందన కనిపించలేదని, అందుకే సమ్మె తేదీ గడువు పెంచాలన్న యాజమాన్యం ప్రతిపాదనను తిరస్కరించినట్లు జేఏసీ వివరించింది. ఈ నేపథ్యంలోనే ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారమే ఈ నెల 13 నుంచి 53,500 మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటారని జేఏసీ స్పష్టంచేసింది.