టికెట్ రిజర్వు చేసుకున్న ప్రయాణీకులకు ఇక ఇబ్బందే!
టికెట్ రిజర్వు చేసుకున్న ప్రయాణీకులకు ఇక ఇబ్బందే!
టికెట్ రిజర్వు చేసుకుంటున్న ప్రయాణీకులకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) షాకిచ్చింది. ఆర్టీసీ రిజర్వ్‌డ్ టికెట్‌లో డ్రైవర్ నెంబర్‌ను ఆర్టీసీ అధికారులు తొలగించారు. డ్రైవర్ నెంబర్ స్థానంలో కేంద్ర సమాచార విభాగం నెంబర్‌ను ప్రవేశపెట్టారు. దసరా తర్వాత హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సర్వీసులకూ డ్రైవర్ నెంబర్‌ను తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
డ్రైవర్లు వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడటమే దానికి కారణం అని ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. అలా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇకపై ఎవరూ డ్రైవర్‌కు ఫోన్ చేయవద్దని దగ్గరలోని బస్ స్టాండ్‌లో బస్సు వివరాలను కనుక్కోవాలని అధికారులు సూచించారు.
దీంతో పాటు ఫిర్యాదులు, ఇతర వివరాల కోసం 24/7 కస్టమర్ కేర్ 0866-2570005 నంబర్‌కు కాల్ చేసి లేదా ఏపీఎస్ఆర్టీసీ యాప్‌లో లైవ్ ట్రాకింగ్ ద్వారా బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చన్నారు.
ఏపీఎస్‌ఆర్‌టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రయాణీకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. టికెట్ రిజర్వు చేసుకున్న ప్రయాణీకులకు ఇది ఇబ్బందే అని కొందరు అంటున్నారు.
ఆర్‌టీసీ టికెట్ రిజర్వ్ చేసుకున్నాక.. ప్రయాణ సమయానికి ముందు బస్సు నంబర్ వివరాలు, డ్రైవర్ పేరు, ఫోన్ నెంబర్‌లు వచ్చేవి. ప్రయాణీకులు బస్సు ఎక్కడుందో డ్రైవర్‌కు ఫోన్ చేసి అడిగి తెలుసుకొనేవారు. యాప్ అంటే ఇంటర్‌నెట్ ఉండాలి.. కస్టమర్ కేర్ అంటే ఫోన్ కనెక్ట్ అవ్వాలిగా అంటున్నారు ప్రయాణీకులు.