నిరసన కోసం టవర్ ఎక్కి, కింద పడిపోయిన ఆశా వర్కర్
నిరసన కోసం టవర్ ఎక్కి, పడిపోయిన ఆశా వర్కర్
నిరసనలో భాగంగా టవర్ ఎక్కిన ఓ ఆశా కార్యకర్త, అక్కడి నుంచి కిందికి దిగే క్రమంలో పట్టుజారి కిందపడిపోయిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తమకు అందిస్తున్న కనీస వేతనాన్ని పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు భోపాల్‌లోని పాలిటెక్నిక్ చౌరహా వద్ద ఉన్న వైర్‌లెస్ టవర్ ఎక్కారు. ఆశా వర్కర్ల నిరసన గురించి సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చచెప్పి కిందకి దించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు, అధికారులు వారిని కిందికి దించేందుకు యత్నిస్తుండగా ఆశా కార్యకర్తల్లో ఒకరు పట్టు కోల్పోయి కిందపడ్డారు. సదరు ఆశా కార్యకర్తకు సహాయంగా నిలిచిన సిబ్బందిలోనూ ఒకరు కిందపడ్డారు. ఈ ఘటనలో గాయాలపాలైన ఆశా వర్కర్‌ని అధికారులు గాంధీ మెడికల్ కాలేజీకి తరలించినట్టుగా ఏఎన్ఐ పేర్కొంది.