తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏటీఎంలలో నగదు నిల్వలు లేకుండా ఖాళీగా మారడంతో జనం పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు. 60% సందర్భాల్లో మాత్రమే ఏటీఎంలలో నగదు వుంటోంది తప్పితే మిగతా సందర్భాల్లో నో క్యాష్ బోర్డులే దర్శనం ఇస్తున్నాయని జనం అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇంకొన్ని బ్యాంకులకు చెందిన ఏటీఎంలు అయితే ఏకంగా గత మూడు నెలలుగా పనిచేయడమే మానేశాయని ఏటీఎంల ముందు బారులు తీరిన జనం తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. రాష్ట్రాల్లో ఏటీఎంల వద్ద జనం అవస్థలు చూసిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల నుంచి నగదు తెప్పించయినా సరే ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు కనిపించకుండా చూడాల్సిందిగా బ్యాంకులని ఆదేశించాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి సహాయం తీసుకుంటుండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొరుగునే వున్న ఒడిషా, తమిళనాడు రాష్ట్రాల నుంచి నగదు అందుతున్నట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే విషయమై ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ జే స్వామినాథన్ ఓ ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ.. '' ఆర్బీఐ అనుమతితో జనవరి, ఫిబ్రవరి నెలల్లో తాము మహారాష్ట్ర, కేరళలోని తిరువనంతపురం ప్రాంతాల నుంచి డబ్బుని తెప్పించగలిగాం కానీ మార్చి నెలలో అలా చేయలేదు'' అని అన్నారు. '' సాధారణంగా 94శాతం ఏటీఎంలలో నగదు నిల్వలు వుండేలా తాము తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే, నోట్ల రద్దు తర్వాత నగదు నిల్వలు పడిపోవడంతో కొంత ఇబ్బందికి గురైన మాట వాస్తవమే. తర్వాత ఏటీఎంలలో నగదు నిల్వలు 85 శాతం వుండేలా చర్యలు తీసుకున్నాం కానీ 2018 జనవరి మాత్రం అది 70 శాతానికి పడిపోయింది'' అని స్వామినాథన్ తెలిపారు. ప్రస్తుతం ఏటీఎంలలో 60 శాతం వరకే నగదు నిల్వలు వుంటున్నాయని స్వామినాథన్ చెప్పారు.


'' ఆసర పెన్షన్ పథకం కింద ఆర్థిక సహాయం పొందే వృద్ధులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనం పొందే వారు సైతం ఈ నగదు కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల ఖాతాలు ఎస్బీఐ పరిధిలోనే వున్నాయి. ఇదే కాకుండా పోస్ట్ ఆఫీసులు, ట్రెజరీలకు ఎస్బీఐనే నగదు సమకూరుస్తోంది. ఆసరా పెన్షన్ పథకం అమలు కోసం పోస్ట్ ఆఫీసులకి ప్రతీ నెల రూ.290 కోట్ల నగదు మొత్తం అందచేయాల్సి వుంటుంది. దీంతో తీవ్రమైన నగదు కొరత ఏర్పడుతోంది. ఆసరా పెన్షన్ కోసం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనం కోసం కొంతమంది పదేపదే పోస్ట్ ఆఫీసుల చుట్టు ప్రదక్షిణలు చేస్తోన్న సందర్భాలు కూడా లేకపోలేదు'' అని స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. 


'' దీనికితోడు 2017  సెప్టేంబర్ నుంచి ఆర్బీఐ రూ.2000 నోట్ల సరఫరాను నిలిపివేయగా, ఆ తర్వాత బ్యాంకుల్లో రూ.2000 విలువైన నోట్లను జనం జమ చేయడం ఆపేశారు. ప్రస్తుతం బ్యాంకుల్లోనూ రూ.2000 నోట్ల నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆర్బీఐ అధికంగా రూ.200, రూ.500 నోట్లనే సరఫరా చేస్తోంది'' అని ప్రస్తుత పరిస్థితి గురించి స్వామినాథన్ ఉన్నది ఉన్నట్టుగా పూర్తిగా వివరించారు.