విశాఖపట్టణం:  వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న జనుపల్లి శ్రీనివాస రావుకు నేటితో రిమాండ్ ముగియనుంది. ఈ కేసులో పోలీసుల నుంచి విచారణ ఎదుర్కుంటూ ప్రస్తుతం విశాఖపట్టణంలోని కేంద్రకారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాస రావును ఎయిర్‌పోర్టు పోలీసులు నేడు మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే బెయిల్ కోసం శ్రీనివాస రావు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో అతడికి మరో 14 రోజులు రిమాండ్ పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. 


అక్టోబర్ 25న విశాఖపట్టణం విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై శ్రీనివాస రావు కత్తితో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో ఇప్పటివరకు వైఎస్ జగన్ తమకు వాంగ్మూలం ఇవ్వలేదని, కేసు దర్యాప్తు కోసం ఆయన వాంగ్మూలం ఇచ్చి సహకరించాల్సిందిగా విశాఖ పోలీసులు కోరుతున్నారు. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో బిజీగా ఉన్న వైఎస్ జగన్.. పోలీసులు చేస్తోన్న విజ్ఞప్తిపై ఏమని స్పందించనున్నారో వేచిచూడాల్సిందే మరి!