కాంట్రాక్టులు సరే.. నిర్వాసితుల సంగతేంటి ? - పోలవరంపై చంద్రబాబుకు పవన్ కల్యాణ్ నిలదీత
ప.గో: పోలవరం నిర్వాసితుల కష్టాలపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గళమెత్తారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల ప్రజలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసి నిర్వాసితులైన వారికి జనసేన సేన పార్టీ అండగా ఉంటుందని అభయమిచ్చారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో తరాలుగా ఉన్న తమ ఊరు, నివాసముంటున్న గూడు.. దున్నుకొనే పొలాన్ని ..ఇలా సర్వం జాతి ప్రయోజనాల కోసం త్యాగం చేసిన నిర్వహితులకు ఏపీ ప్రజలందరూ రుణపడి ఉండాలని పవన్ వ్యాఖ్యానించారు.
నష్టపరిహారం ఇవ్వకుంటే ఊరుకోం..
జాతి ప్రయోజనాల కోసం సర్వం త్యాగం చేసిన వారిని ఆదుకోవాల్సిన చంద్రబాబు సర్కార్..తన బాధ్యతను విస్మరించిందని పవన్ విమర్శించారు. కాంట్రాక్టర్ల ప్రయోజనం తప్పితే నిర్వాసిత ప్రజల బాగోగులు ఈ ప్రభుత్వానికి పట్టవని ఆరోపించారు. ప్రతి ఏటా కాంట్రాక్టర్లకు రేట్లు పెంచే ముఖ్యమంత్రి పోలవరం నిర్వాసితుల విషయంలో ఎందుకు అలా చేయడం లేదని పవన్ నిలదీశారు. బాధితులందరికీ పూర్తి స్థాయి నష్ట పరిహారం, పునరావాసం కల్పించే వరకు జనసేన పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ నిర్వాసితులకు భరోసా ఇచ్చారు.