Unstoppable 2: వెన్నుపోటు ఎపిసోడ్ సమర్ధించేందుకే అన్ స్టాపబుల్ 2 ప్లాన్ చేశారా
Unstoppable 2: ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ 2 మరోసారి హిట్టైంది. అన్ స్టాపబుల్ 2..చంద్రబాబు, లోకేష్‌లతో చేయడం వెనుక కారణం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రశ్నల ప్లానింగ్ కూడా ఆయనదేనా అనే చర్చ నడుస్తోంది.
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అలరించిన అన్‌స్టాపబుల్ టాక్ షో 2 ఊహించినట్టే హిట్టైంది. సీజన్ 2 తొలిషో వినోదానికి కాస్త భిన్నంగా సాగిందనే విమర్శలొచ్చినా..అందర్నీ ఆకట్టుకుంది. 80 శాతం రాజకీయాలపైనే సాగిన అన్ స్టాపబుల్ 2 వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. నాటి వెన్నుపోటు ఎపిసోడ్ పై ప్రశ్నల వెనుక కారణేంటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఆహా ఓటీటీలో ఎంటర్‌టైన్‌మెంట్‌గా అన్‌స్టాపబుల్ ప్రారంభమైంది. ఇప్పుడు అన్‌స్టాపబుల్ 2లో చంద్రబాబు లోకేష్ రావడం, ప్రశ్నలన్నీ రాజకీయ కోణంలో ఉండటం వెనుక పెద్ద వ్యూహామే ఉంది. చంద్రబాబు జీవితంలో మాయనిమచ్చ, ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేని ఘటన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు అంశం. ఇటీవలి కాలంలో ఆ సీన్ మరోసారి తెరపైకి వచ్చింది.
ఏపీ ప్రభుత్వం ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును తొలగించి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా మార్చడంతో పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి. మహనీయుడు ఎన్టీఆర్‌కు అవమానమని చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. టీడీపీ చేస్తున్న ఆందోళనకు సమాధానంగా అధికార పార్టీ నేతలు 1995 ఎపిసోడ్‌ను ప్రజలు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన తీరును పదే పదే స్క్రీన్ చేసి చూపించారు. మరోవైపు ఏబీఎన్ షోలో ఆర్కేతో చంద్రబాబు పిచ్చాపాటి మాట్లాడుతూ..ఎన్టీఆర్ పేరు మర్చిపోయేలా చేయాలని చెప్పిన వీడియోను లీక్ చేశారు. ఎన్టీఆర్‌ను నాడు చంద్రబాబు అండ్ కో, నందమూరి కుటుంబసభ్యులు ఎలా చిత్రవధకు గురి చేశారో ప్రజలకు మరోసారి గుర్తు చేసింది అధికార పార్టీ.
వైసీపీ ఎదురుదాడి చేయడంతో టీడీపీ పూర్తిగా డిఫెన్స్‌లో పడింది. టీడీపీ పేరుమార్పుపై ప్రశ్నించిన ప్రతిసారీ 1995 సీన్ గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేశాయి వైసీపీ వర్గాలు. అందుకే ఆ ఘటన ఎందుకు జరిగింది, ఏ పరిస్థితుల్లో జరిగిందో వివరిస్తూ..వెన్నుపోటు ముద్రను ప్రజల మదిలోంచి చెరిపేసేందుకు లేదా నాటి ఘటనను సమర్ధించేందుకే అన్‌స్టాపబుల్ 2 ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ షోలో ఆ ప్రశ్నలే ప్రధానంగా ఉన్నాయి.
నాడు మనం చేసింది తప్పా..చంద్రబాబు
1995లో ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించడం తప్పా అని బాలకృష్ణను చంద్రబాబు అడగడం ఈ షోలో హైలెట్. అంటే నాడు నందమూరి కుటుంబంతో కలిసే ఈ నిర్ణయం తీసుకున్నామనే విషయాన్ని ప్రజలకు చెప్పడమే దీనివెనుక ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఆ నిర్ణయాన్ని నందమూరి కుటుంబం, టీడీపీ కలిసి తీసుకున్నాయని...చంద్రబాబు చేసింది తప్పు కాదని 1999 ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని బాలకృష్ణతో సమాధానం చెప్పించడం కూడా ఉద్దేశ్యమిదే.
మొత్తం ప్లాన్ ప్రకారమే అన్ స్టాపబుల్ స్క్రిప్ట్ సాగింది. 1995లో జరిగిన ఓ ఘటనను చంద్రబాబు ఈ షోలో వివరించారు. ఎన్టీఆర్‌ను నచ్చజెప్పేందుకు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణలతో కలిసి తాను ఎన్టీఆర్ గదిలోకి వెళ్లామని..అప్పుడు బీవీ మోహన్ రెడ్డి కూడా ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. మీతో మాట్లాడాలని ఎన్టీఆర్‌ను కోరినప్పుడు కుటుంబమా, రాజకీయమా అని అడిగినట్టు చంద్రబాబు చెప్పారు. రాజకీయాలు మాట్లాడాలని చెప్పగా...హరికృష్ణ, బాలకృష్ణను బయటకు పంపించి తనతో మాట్లాడారని చంద్రబాబు వివరించారు.
కాళ్లు పట్టుకుని వేడుకోవడం
పార్టీని, అధికారాన్ని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయవద్దు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించండని ఎన్టీఆర్‌ను కాళ్లు పట్టుకుని వేడుకున్నా ఫలితం లేకపోయిందని చంద్రబాబు అన్‌స్టాపబుల్ షోలో వివరించారు. అంటే నాడు జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు చంద్రబాబు.
అసలు అప్పుడేం జరిగింది..చంద్రబాబు చెప్పింది నందమూరి కుటుంబం నమ్మిందా
అయితే లోపల ఏం జరిగిందీ, చంద్రబాబు ఏం మాట్లాడారనేది బాలకృష్ణ, హరికృష్ణలకు తెలియదని ఇప్పుడు చంద్రబాబు మాటలతో అర్ధమైంది. అంటే చంద్రబాబు ఏం చెప్పారో అదే నాడు బాలకృష్ణ, హరికృష్ణను నమ్మేశారా అనే ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పుడు. నిజంగానే కాళ్లు పట్టుకుని వేడుకున్నారా లేదా అనే సందేహాలొస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు చెప్పినట్టు నాటి ఘటనలో ఇప్పుడు బతికున్నది చంద్రబాబు, బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణ ఆ గదిలోకి వెళ్లలేదు.
ఆహాలో అన్‌స్టాపబుల్ వంటి వినోదాత్మక ఎపిసోడ్స్‌లో రాజకీయాలు మాట్లాడటం, చంద్రబాబు, నారా లోకేష్‌ను రప్పించడం వెనుక బావాబావమరుదులు కలిసి నాటి ఘటనలో చంద్రబాబు తప్పేమీ లేదని చెప్పే ప్రయత్నమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook