తుర్పు గోదావరి ధవలేశ్వరం బ్యారేజీపై పవన్ కల్యాణ్ తలపెట్టిన ‘జనసేన కవాతు’కు అడ్డంకులు ఎదురౌతున్నాయి. ప్రముఖ మీడియా కథనం ప్రకారం జనసేన కవాతుకు అనుమతి ఇవ్వలేమని రాజ మహేంద్రవరం పోలీసులు స్పష్టం చేశారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేపట్టిన ‘పోరాట యాత్ర’ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో జన సైనికుల కవాతుకు పార్టీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై జనసేన నేతలు, కార్యకర్తలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ కుట్రేనని ఆరోపిస్తున్నారు. 


పోలీసులు చెబుతున్న కారణాలు ఇవే...
ధవలేశ్వరం బ్యారేజీ  పిట్ట గోడలు బలహీనంగా ఉన్నందున కవాతు నిర్వహించేందుకు అనుకూలంగా లేదని పోలీసులు పేర్కొన్నారు. బహిరంగ సభ కోసం మరో ప్రాంతాన్ని చూసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ రోజు నిర్వహంచ తలపెట్టిన కవాతులో లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నందున ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశముందన్న పోలీసులు..ప్రజల భద్రత దృష్ట్యా దీనికి అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పారు. కవాతుకు అనుమతి ఇస్తే  తొక్కిసలాట చోటు చేసుకునే ప్రమాదముందని పోలీసులు నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది.