ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ నిశ్చితార్థం కుటుంబసభ్యుల మధ్య హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మాజీ ఏపీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్‌తో నిశ్చితార్థం జరిగింది. భార్గవ్ మంత్రి నారాయణకు కూడా సమీప బంధువే. ఆగస్టు29న ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ, భార్గవ్ వివాహం జరగనున్నట్లు సమాచారం.  శోభా నాగిరెడ్డి హఠాన్మరణంతో అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. కాగా అఖిలప్రియ, భార్గవ్‌ల మధ్య చాలాకాలం నుంచి స్నేహం ఉందని తెలుస్తోంది.


అఖిలప్రియకు వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడితో 2010లో వివాహం జరిగింది. సంవత్సరం వరకు అన్యోన్యంగా ఉన్న ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు రావడం, అవి కాస్త పెద్దవి కావడం, ఇరువర్గాల కుటుంబ సభ్యులు కూర్చున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో .. ఇక చేసేదేమీ లేక విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత వ్యాపారంలో వెళ్ళాలనుకున్న అఖిలప్రియ.. తల్లి హఠాత్మరణంతో రాజకీయాల్లో ప్రవేశించి ఉప ఎన్నికలో ఆళ్లగడ్డ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి రాజకీయాల నేపథ్యంలో తండ్రి భూమా నాగిరెడ్డి,  భూమా అఖిలప్రియ ఇద్దరూ టీడీపీలో చేరారు. నంద్యాల ఎంఎల్ఏగా ఉన్న తండ్రి భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం భూమా ఆఖిలప్రియ పర్యాటక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.