జగన్ పై దాడి చేసిన నిందితుడి కాల్ డేటా సేకరణ.. సిట్ అధికారుల సుదీర్ఘ విచారణ
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కోడికత్తితో దాడి చేసిన యువకుడిని ఆదివారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కోడికత్తితో దాడి చేసిన యువకుడిని ఆదివారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనను ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషనుకి తీసుకొచ్చిన సిట్ అధికారులు రాత్రి 10 గంటల వరకు విచారణ చేపట్టారు. తర్వాత నిందితుడి కాల్ డేటాను కూడా సేకరించారు. ఆయన గతంలో ఎవరెవరితో ఎంతసేపు మాట్లాడాడు..? ఎలాంటి విషయాలను ఫోన్ ద్వారా చర్చించారు? అనే విషయాలను కూడా సేకరించడం జరిగింది.
అలాగే నిందితుడి బంధువులను కూడా స్టేషన్‌కు రప్పించి మాట్లాడారు. ఇంకా.. దాడికి పాల్పడిన శ్రీనివాసరావు కోసం తొమ్మిది పేజీలు లేఖ రాసిన సోదరి వరసైన జె.విజయదుర్గతో పాటు ఎయిర్ పోర్టులో సెక్యూరిటీగా పనిచేస్తున్న రేవతీపతిని కూడా పోలీసులు ప్రశ్నించారు. అలాగే నిందితుడు శ్రీనివాసరావును ఆరు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. నవంబరు 2వ తేది వరకూ ఈ విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు.
కాగా.. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన హత్యా యత్నం కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన కుట్రదారుడని వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. టీడీపీ, బీజేపీ కలిసి ఉన్నప్పుడే సినీ నటుడు ఆపరేషన్ గరుడ గురించి చెప్పినప్పుడు చంద్రబాబు దానిపై ఎందుకు విచారణ జరిపించలేదని పలువురు వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శాసన మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.