హైదరాబాద్‌లో వెలుగుచూసిన మరో బ్యాంకు మోసం
బ్యాంకుల్లో సంస్థల మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
బ్యాంకుల్లో సంస్థల మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వేలాది కోట్ల మేర రుణాలు తీసుకొని బ్యాంకులకు ఎగనామం పెట్టిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా, గీతాంజలి జ్యువెల్లర్స్, నీరవ్ మోదీ మోసాల కేసులు ఇంకా ఇక కొలిక్కి రాక ముందే ..తాజాగా, ఈ తరహా ఘటనలు హైదరాబాద్‌లోనూ చోటు చేసుకోవడం గమనార్హం.
జయ అంబే గౌరీ కెమికల్స్ అనే సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ఋణం, టర్మ్ లోన్, లెటరాఫ్ క్రెడిట్ రూపంలో మొత్తం రూ.65కోట్లకు పైగా నగదును రుణంగా తీసుకుంది. 2009 నుంచి ఈ సంస్థ ఋణం తీసుకొంటోంది. 2014 ఏప్రిల్ 30వ తేదీన ఈ సంస్థను బ్యాంకు అధికారులు నిరర్ధక ఆస్తిగా ప్రకటించడంతో ఇందులో మోసం జరిగిందని ఆర్బీఐకి ఫిర్యాదు చేసింది. అలానే తీసుకున్న రుణాన్ని ఇతర ఖాతాలోకి మళ్ళించారని, తనఖా పెట్టిన ఆస్తులు వివాదాస్పదమైనవని 2016లో మరో బ్యాంకు అధికారులు ఆర్బీఐని ఆశ్రయించారు. దీనిపై మూడు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ.. కంపెనీ ఛైర్మన్ నరేంద్ర కుమార్ పటేల్ సహా సహకరించిన బ్యాంకు సిబ్బంది (మొత్తం 8 మంది) పై కేసు నమోదు చేశామని హైదరాబాద్ సీబీఐ తెలిపింది. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
చేపల చెరువుల పేరుతో ఐడీబీఐ బ్యాంకును మోసం చేసిన వారిపై ఇటీవలే హైదరాబాద్ సీబీఐ కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే..! హైదరాబాద్‌కే చెందిన టోటెమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాను రూ.1394 కోట్లకు మోసం చేసిందంటూ ఢిల్లీ సీబీఐ కేసు నమోదు చేసింది.
ఇదిలా ఉండగా.. నీరవ్ మోదీకి పీఎన్‌బీ ఋణం ఇచ్చే క్రమంలో ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకుందో తెలపాలని కోరుతూ ముంబయికి చెందిన అనిల్ గల్గాలి సమాచార హక్కు చట్టం ద్వారా ఆ బ్యాంకుకి దరఖాస్తు చేసుకొన్నారు. అయితే కేసు నడుస్తున్న క్రమంలో.. సెక్యూరిటీ కారణాల వల్ల ఆ వివరాలు వెల్లడించలేమని బ్యాంకు యాజమాన్యం తెలిపింది. ఇటీవలే నీరవ్ మోదీకి సంబంధించిన కేసులో బ్యాంకు నుండి సొమ్ము కొల్లగొట్టే క్రమంలో ఆయన హవాలా వ్యాపారస్థుల సహాయం తీసుకున్నారని కొన్ని కథనాలు వెలువడ్డాయి.హాంగ్ కాంగ్, దుబాయ్ కేంద్రాలుగా ఈ హవాలా లావాదేవీలు చేసినట్లు తెలుస్తోంది.