రూ.1394 కోట్ల ఫ్రాడ్ చేసిన హైదరాబాద్ కంపెనీ..!
పంజాబ్ నేషనల్ బ్యాంకు కేసు దేశాన్ని మొత్తం కుదిపేసిన తర్వాత.. ఇప్పుడు అలాంటి కేసులు ఒక్కొక్కటి తెరమీదికి వస్తున్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంకు కేసు దేశాన్ని మొత్తం కుదిపేసిన తర్వాత.. ఇప్పుడు అలాంటి కేసులు ఒక్కొక్కటి తెరమీదికి వస్తున్నాయి. గురువారం హైదరబాద్‌లోని టోటెమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీ వివిధ బ్యాంకుల నుండి రూ.1394 కోట్లను తీసుకొని.. ఛీటింగ్‌కి పాల్పడినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు సీబీఐ అధికారులు ఆ కంపెనీ నిర్వాహకులకు సర్క్యులర్స్ పంపించారు.
అయితే కంపెనీ నిర్వాహకులు కనిపించకుండా పోయారని వార్తలు రావడంతో.. కంపెనీ ఆఫీసుతో పాటు హైదరాబాదులో పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. ఆ కంపెనీ నిర్వాహకులు ఆదాయ పన్ను శాఖకు కూడా రూ.400 కోట్ల రూపాయలు బకాయి పడ్డట్లు తెలుస్తోంది. ఆ కంపెనీ నిర్వాహకుల వివరాలు అప్పగించిన వారికి రూ.15 లక్షలు నగదు బహుమతి కూడా ఇస్తామని ఆదాయపన్ను శాఖ గతంలో ప్రకటించింది.
యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు టోటెమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పై కేసు నమోదు చేశారు సీబీఐ అధికారులు. ఆ బ్యాంకుకు రూ. 303.84 కోట్లు బకాయి పడినట్లు తెలుస్తోంది. యూబీఐ ఫిర్యాదు ఇచ్చాక.. మరికొన్ని బ్యాంకులు కూడా ఇదే సంస్థపై ఫిర్యాదు ఇవ్వడం గమనార్హం. అయితే 2012 నుండీ సదరు నిర్వహకులు బకాయిలు చెల్లించడం లేదని తమకు తెలిసినట్లు సీబీఐ అధికారులు అంటున్నారు.
రోడ్డు నిర్మాణ రంగ వ్యాపారంలో ఉన్న ఈ సంస్థ పలు బిల్డింగ్ కన్స్‌ట్రక్షన్ పనులతో పాటు వాటర్ వర్క్స్ కాంట్రాక్టులకు కూడా చేస్తోంది. ఎల్ అండ్ టీ, రైట్స్ లాంటి ప్రముఖ సంస్థలకు ఈ కంపెనీ సబ్ కాంట్రాక్టరుగా కూడా ఉండడం గమనార్హం