విశాఖ: వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి ఘటనపై కేంద్రం స్పందించింది. తక్షణమే దర్యాప్తు మొదలు పెట్టాలని అధికారులకు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా .. వైఎస్ జగన్ పై జరిగిన దాడిని  ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టాలని సీఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యాలయంతో సహా అన్ని శాఖలను ఆదేశించారు. ఈ ఘటన ఎయిర్ పోర్టులో జరిగిన నేపథ్యంలో బాధ్యులను గుర్తించాలని విమానయాన శాఖ కార్యదర్శికి  పౌర విమానాయనశాఖ మంత్రి సురేష్ ప్రభు ఆదేశాలు జారీ చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో జగన్ పై ఓ దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి కోడి పందెలకు ఉపయోగించే కత్తితో అతను జగన్‌పై దాడి చేశాడు. దీంతో జగన్‌ భుజానికి గాయమవడం.. ప్రాధమిక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించడం జరిగింది. మరోవైపు దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నపోలీసులు అతన్ని విచారించగా..అతని పేరు శ్రీనివాస్ అని.. తను ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌ పనిచేస్తున్నానని వెల్లడించినట్లు తెలిసింది. కాగా నిందితుడి నుంచి  మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి ఈ మేరకు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.