ఢిల్లీకి రావాల్సిందిగా ఏపీ అధికారులకు కేంద్రం నుంచి ఆదేశాలు
ఢిల్లీ వెళ్లనున్న ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన ఉన్నతాధికారుల బృందం
ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన ఉన్నతాధికారుల బృందం ఒకసారి ఢిల్లీకి రావాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీచేసింది. కేంద్రం నుంచి అందిన ఆదేశాల మేరకు రాష్ట్ర విభజన హామీలకు సంబంధించిన దస్త్రాలతోపాటు కేంద్రం నుంచి ఇప్పటి వరకు అందిన నిధుల వివరాలతో కూడిన సమాచారంతో ఏపీకి చెందిన అన్ని కీలక శాఖల ఉన్నతాధికారుల బృందం ఈ నెల 21న ఢిల్లీ వెళ్లనుందని తెలుస్తోంది.
ఢిల్లీలో కేంద్రంలోని కీలక శాఖల కార్యదర్శుల సమక్షంలో జరిగే ఓ భేటీలో ఏపీ అధికారులు పాల్గొననున్నారని కేంద్ర ఆర్థిక శాఖ సమాచారం పంపింది. 21, 22వ తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. ఏపీలో నిర్మించతలపెట్టిన కేంద్ర సంస్థల నిర్మాణాలకు కేటాయించిన నిధులు, కడప ఉక్కు కర్మాగారం, విశాఖ పోర్టు అభివృద్ధి, నూతన రాజధాని నిర్మాణం పురోగతి, అందిన నిధుల వివరాలు వంటివి ఈ భేటీలో కీలకంగా ప్రస్తావనకు రానున్నట్టు సమాచారం.
ఈ భేటీలో కేంద్రం నుంచి ఎదురయ్యే అన్నిరకాల సందేహాలకు సమాధానం చెప్పే విధంగా సోమవారం సాయంత్రంలోగా అన్ని శాఖల అధికారులు నివేదికలు సిద్ధం చేయాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అటు కేంద్రం నుంచి పిలుపు, ఇక్కడ సీఎం నుంచి ఆదేశాలు రావడంతో ఏపీ అధికారుల్లో వణుకు మొదలైందనే టాక్ వినిపిస్తోంది. కేంద్రం అడిగిన లెక్కలు సరిగ్గా చెప్పలేకపోయినా, చెప్పి ఒప్పించలేకపోయినా.. తిరిగొచ్చాకా ఏపీ సీఎం చంద్రబాబు ఏమంటారోననేది వారి భయమట.!