కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా.. చంద్రబాబుకి సోషల్ మీడియాలో ఆదరణ తగ్గుతోందా..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చెందిన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ ఒక ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ ఏజెన్సీకి ఆయన సంవత్సరానికి రూ.6 కోట్లు చెల్లిస్తున్నారని పలు ప్రముఖ పత్రికల్లో వార్తలు రావడం గమనార్హం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చెందిన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ ఒక ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ ఏజెన్సీకి ఆయన సంవత్సరానికి రూ.6 కోట్లు చెల్లిస్తున్నారని పలు ప్రముఖ పత్రికల్లో వార్తలు రావడం గమనార్హం. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఈ మధ్యకాలంలో మిగతా పార్టీలతో పోల్చుకుంటే సోషల్ మీడియా ప్రచారంలో కాస్త వెనుకబడే ఉందని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్‌లో అనుచరగణాన్ని పెంచుకోవడంలో కూడా తెలుగుదేశం కాస్త వెనుకబడే ఉందని వార్తలు వస్తున్నాయి.
అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం కోసం ఓ కంపెనీకి దాదాపు రూ.25 కోట్లు ఇస్తుందని కూడా సమాచారం. అయితే ఈ పరిస్థితికి కారణం నారా చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో బలమైన పబ్లిక్ రిలేషన్ విభాగం లేకపోవడం ఒక కారణం అయితే.. ఎంతో ప్రాచుర్యం ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా సోషల్ మీడియా ప్రమోషన్ల కోసం థర్డ్ పార్టీ సంస్థలపై ఆధారపడడం అనేది ఎంత వరకు సబబు అని కూడా పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించి సోషల్ మీడియా ప్రచార బాధ్యతలను స్థానికతను వదిలి పెట్టి ఉత్తరాదికి చెందిన వ్యక్తులకే ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని పలు వార్తలు వచ్చాయి. పైగా అనుచరగణం తక్కువగా ఉన్నా.. తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారంతో పోల్చుకుంటే.. చంద్రబాబు ఆధ్వర్యంలోని టీమ్ చేస్తున్న ప్రచారం కాస్త బలహీనంగా ఉందని.. అందుకు తగ్గ టీమ్‌ను నియమించే విషయంలో తెలుగుదేశం తప్పకుండా ఆలోచించాలని పలువురు అంటున్నారు.