ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారత ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ చర్చా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఫ్లోర్‌లీడర్‌ విష్ణుకుమార్‌ రాజు 90 శాతం విభజన హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందని తెలియజేయగా.. చంద్రబాబు మండిపడ్డారు. మనస్సాక్షి లేకుండా మాట్లాడవద్దని.. ఇప్పటి వరకు కేంద్రం రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులు కేవలం మోదీకి వత్తాసు పలుకుతూ మాట్లాడకూడదని.. వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని చంద్రబాబు హితవు పలికారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుజరాత్ పై మోదీకి ఉన్న ప్రేమ.. ఆంధ్రప్రదేశ్ పై 5 శాతం కూడా లేదని తెలిపారు. ఈసారి తాము ఊరుకొనేది లేదని.. విశాఖకు కచ్చితంగా రైల్వే జోన్ ఇవ్వాల్సిందేనని చంద్రబాబు అన్నారు. కడప స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కూడా కేంద్రం మీన మేషాలు లెక్కబెట్టడానికి కారణం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. యూనివర్సిటీల ఏర్పాటు కోసం భూమి కేటాయిస్తే కేంద్రం కాలయాపన చేయడానికి కారణం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. 


విశాఖకు మెట్రో ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ సర్కార్.. ఇప్పుడు ఆ విషయమే మర్చిపోయిందని చంద్రబాబు అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికే 29 సార్లు ఢిల్లీ వెళితే.. ఎదురుదాడి చేసి కేసులు పెట్టేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇచ్చిన హామీలేవీ నెరవేర్చే ఉద్దేశం కేంద్రానికి లేదని.. అందుకే ఎన్డీఏ నుండి బయటకు వచ్చి పోరాడుతున్నామని.. ప్రజల బలం కూడా తమ వైపే ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. అలాగే బాబ్లీ ప్రాజెక్టు విషయానికి సంబంధించి తనకు ఒక్క నోటీసు కూడా అందలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.