దసరా రోజు పంచెకట్టుతో అలరించిన చంద్రబాబు
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ పురోహితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దసరా వేడుకల్లో చంద్రబాబు మనవడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తాతతో కలిసి పంచెకట్టుతో దేవాన్ష్ ఆలయానికి వచ్చాడు. పూజ సమయంలో దేవాన్ష్ తాత ఒడిలో కూర్చున్నాడు. దుర్గమ్మ దర్శనం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ మంచి పనిచేయాలన్న కొన్ని దుష్టశక్తులు అడ్డుతగులుతున్నాయని..వైసీపీ నుద్దేశించి పరోక్షంగా విమర్శించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర అభివృద్ధి సాధించితీరుతామని చంద్రబాబు అన్నారు. అమరావతి నిర్మాణం, పోలవరం, వాటర్ గ్రిడ్, స్మార్ట్ పవర్ గ్రిడ్ పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఏపీ సీఎం హామీ ఇచ్చారు.