ఊహాగానాలకు తెర; చంద్రబాబే టీడీఎల్పీ నేత
ఉండవల్లిలో ఈ రోజు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీఎల్పీ సమావేశం జరిగింది
అమరావతి: బుధవారం ఉదయం ఉండవల్లిలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీఎల్పీనేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
టీడీఎల్పీ నేతగా తీర్మానిస్తూ చేసిన ప్రతిపాదనకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. టీడీఎల్పీ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు నారా లోకేష్, బాలయ్య, పార్టీకి చెందిన పలువురు సీనియర్లు పాల్గొన్నారు.
ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైనందున టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఉండకపోవచ్చని తొలుత ఊహాగానాలు వెలువడ్డాయి. చంద్రబాబు స్థానంలో పార్టీలోని సీనియర్ సభ్యుడు ఎవరికైనా అవకాశమిస్తారని జోరుగా ప్రచారం సాగింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ టీడీపీ సభ్యులు తమ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు.