విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన కరోనా వైరస్‌ ( Coronavirus ) అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. ఏపీలో మద్యం ధరల పెంపుపై (Liquor price hike in AP) టీడీపీ చేస్తోన్న విమర్శలపై స్పందించే క్రమంలో పార్ధసారథి ( MLA Parthasarathy ) బుధవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై, ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. '' టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీకి పట్టిన కరోనావైరస్ అయితే, టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ (TDP MLC Rajendra Prasad) ఉయ్యురుకు పట్టిన కరోనా వైరస్‌ '' అని ఎద్దేవా చేశారు. ఏపీలో దశల వారీగా మద్యపాన నిషేదం అమలు చేస్తానని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాకముందే ప్రకటించారని.. అందులో భాగంగానే ఇలా లిక్కర్ ధరలు పెంచి మద్యానికి బానిసలైన పేదలను మద్యానికి దూరం చేసేందుకు కృషిచేస్తున్నారని పార్థసారధి అన్నారు. ఓవైపు కరోనాని ఎదురుకుంటూనే మరోవైపు ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ విమర్శలు చేయడంలో అర్థం లేదని అన్నారు. 


ఇదిలావుంటే, ఇదే అంశంపై ఏపీఐఐసి చైర్మన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ సర్కార్ పెంచిన ధరలు చూస్తే... మద్యానికి బానిసలైన చాలామంది పేదవాళ్లు ఇక మద్యానికి దూరం అవుతారనే ఆశిస్తున్నట్టు ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు.