అమరావతి: తెలుగుదేశం పార్టీ మహానాడు చాలా ఘనంగా జరపాలని.. ఏడాది కాలంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గురించి మహానాడు వేదిక ద్వారా ప్రజలకు వివరించాలని చంద్రబాబు భావించారట. కానీ కొరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ లాంటి పరిణామాల కారణంగా అది బాబుకు కుదిరేలా లేదు. అందుకే తెలుగు తమ్ముళ్లు చేసేదేమిలేక వర్చువల్ మహానాడు నిర్వహించాలని ఓ నిర్ణయానికొచ్చారు. మహానాడు ఆసన్నమైంది కనుకే చంద్రబాబు హైదరాబాద్ నుంచి సోమవారం స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే మహానాడు నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెక్నాలజీని ఉపయోగించి మహానాడును జరుపనున్నారు. మొత్తం 25 వేల మంది ప్రజలు మహానాడును వీక్షించేలా సాంకేతిక పరమైన ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ సారి మహానాడులో మొత్తం 52 మంది నేతలు ప్రసంగించనున్నారు. సామజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న తెలుగుదేశం మహానాడు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పదహారు వందల మంది కార్యకర్తలు హాజరవుతున్నారు. 


అమరావతిలో జరుగనున్న ఈ మహానాడులో 27వ తేదీన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముందుగా పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం చంద్రబాబు నాయుడు ప్రసంగం ఉంటుంది. ఆయన ప్రసంగాన్ని సామజిక మాధ్యమాల్లో 25 వేల  మంది జనం వీక్షించనున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు చెందిన ప్రధాన నేతల ప్రసంగాలు కూడా ఉంటాయి. ఎవరెవరు ఏయే అంశాలపై ప్రసంగం చెయ్యాలో ఇప్పటికే చంద్రబాబు అందరికి సూచనలు ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన నేతలు ఎవరు ఏం  మాట్లాడాలి ? తెలంగాణ తెలుగుదేశం నేతలు ఏయే అంశాలపై ప్రసంగించాలి వంటి సలహాలను బాబు చెప్పేశారు. 28వ తేదీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు జన్మదినం పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్ ఘాట్ వద్ద ఇక్కడి నేతలు నివాళ్ళర్పిస్తారు. కరోనా లాక్ డౌన్ కారణంగా చంద్రబాబు హైదరాబాద్‌కు వచ్చే అవకాశం లేదు. ఓడిపోయినా కూడా మహానాడును ఎంతో అట్టహాసంగా నిర్వహించాలన్న చంద్రబాబు ఆలోచనలపై కరోనావైరస్ నీళ్లు చల్లిందనే టాక్ వినిపిస్తోంది.