విజయవాడ సమీపంలోని మంగళగిరి వద్ద ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారు ఎక్కడున్నా వారి సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని, స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేసే ఏకైక పార్టీ తెదేపా అని చెప్పారు. కార్యాలయంలో నిత్య భోజనం కల్పించడం ఆనవాయితీగా వస్తోందని.. దాని కోసం ఫిక్స్ డ్ ఫండ్ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. టీడీపీ కార్యాలయం తొమ్మిది నెలల్లో పూర్తవుతుందని, కార్యకర్తలందరూ భాగస్వాములవ్వాలని సీఎం కోరారు. ఇక్కడే కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీ మంత్రులు నారా లోకేష్, నారాయణ, ఏపీ, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావ్, రమణ, పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు. 


కాగా చంద్రబాబు ఇచ్చిన పిలుపుమేరకు టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయానికి విరాళాలు ప్రకటించారు. గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు రూ.11 లక్షలు, దేవినేని అవినాష్ రూ. 10 లక్షలు, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ 1.50 లక్షలు,  తెదేపా నాయకులు మల్లు సురేంద్ర, కోటేశ్వరావు రూ.50 వేలు విరాళాలు అందజేశారు.