తెలుగుదేశం పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ-పొలిట్‌ బ్యూరోలో జూనియర్ ఎన్టీఆర్‌కు చోటు దక్కనుందా? అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా ఉన్న మాజీ రాజ్యసభ ఎంపీ నందమూరి హరికృష్ణ ఇటీవలే నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. హరికృష్ణ మరణంతో పొలిట్‌ బ్యూరోలో ఆయన స్థానంలో నందమూరి కుటుంబీకులనే తీసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నారట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈమేరకు ఆయన సీనియర్లతో చర్చలు జరుపుతున్నట్టు టాక్. చాలామంది సీనియర్లు హరికృష్ణ కుటుంబం నుంచి పొలిట్‌బ్యూరోలోకి జూనియర్ ఎన్టీఆర్‌‌ను తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తంచేసినట్టు సమాచారం. జనసేన పవన్ కళ్యాణ్‌కు కౌంటర్‌ ఇవ్వాలంటే.. అదే సినీ రంగానికి చెందిన ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపాలని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. ఆతర్వాతే పొలిట్‌ బ్యూరోలోకి ఎన్టీఆర్ వస్తారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.


నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ ఆల్రెడీ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి.. ఎన్టీఆర్‌ను పొలిట్‌బ్యూరోలోకి తీసుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కేబినెట్ విస్తరణ తర్వాత మరోసారి పార్టీ విస్తృతస్థాయి భేటీ నిర్వహించి హరికృష్ణ స్థానంలో ఎవరిని నియమించాలన్న దానిపై చంద్రబాబు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు.


2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల తర్వాత అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్టీఆర్.. గతకొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. సినీరంగంలో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే తాను దూరంగా ఉన్నట్లు అప్పట్లో ఎన్టీఆర్‌ మీడియాకు చెప్పారు.