చంద్రబాబు యూఏఈ పర్యటన విశేషాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు అధికార పర్యటన నిమిత్తం వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూఏఈ అధ్యక్షుడి అల్లుడు షేర్ హమీద్ బిన్ తహ్‌నౌన్ అల్ నహ్యాన్‌ను కలిశారు. ఆయనతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వనరులు, పెట్టుబడి పెట్టే అవకాశాల గురించి మాట్లాడారు. కొత్త రాష్ట్రం అభివృద్ధికి సహాయసహకారాలు అందించాలని కోరారు. సీఎం విజ్ఞప్తికి తహనౌన్ సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అబుదాబీలోని షేక్ జాయెద్ మసీదును సందర్శించారు. అలాగే యూఐఈ ప్రధాని మంత్రి ఆఫీసు ఛైర్మన్ మహ్మద్ అబ్దుల్ ఆల్ గెర్గావీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈలో ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ బీఆర్ షెట్టీతో భేటీ అయ్యారు. ఆయనతో అల్పాహార విందులో పాల్గొన్నారు. అలాగే దుబాయ్‌లో ఎన్నారైల కోసం కొన్ని పథకాలను ప్రకటించారు.
అక్కడి షేక్ రషీద్ ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన గల్ఫ్‌లో పనిచేసే తెలుగు ఉద్యోగుల కోసం 24/7 హెల్ప్ లైన్ ప్రారంభించారు. అలాగే వారి కోసం 1 మిలియన్ రూపాయల ఇన్సూరెస్ స్కీమ్, అలాగే ఎమర్జనీ ఫండ్ సౌలభ్యాన్ని కూడా ప్రభుత్వం కలిగిస్తుందిని తెలిపారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ " ఈ పర్యటనలో 'ప్రవాసాంధ్ర భరోసా’ పేరుతో భీమా పథకం తీసుకొచ్చాము. అత్యవసరంగా సహాయం అందించేందుకు ‘ప్రవాసాంధ్రనిధి’ ఏర్పాటుచేశాము. నైపుణ్యాలు మెరుగుపర్చేందుకు మైగ్రెంట్ ఎకనమిక్ రిహాబిలిటేషన్ సెంటర్ స్థాపిస్తున్నాం. ప్రవాస ఆంధ్రుల సంక్షేమానికి రూ. 40 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశాము. ప్రవాసాంధ్రులు రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టాలి. వ్యాపారాలు చేయాలంటే మీకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. అధునాతన సాంకేతికతను పాలనలో తీసుకొచ్చాము. దుబాయ్ కంటే విశాఖ బాగుంది అనే ప్రశంసా వ్యాఖ్యలు వినిపించాయి ఇది మనకెంతో గర్వకారణం. అమరావతి నుండి ఎమిరేట్స్ కు నేరుగా విమానం వస్తుంది. విజన్ 2029 నాటికి దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నవ్యాంధ్ర ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం" అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నారై శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్ణుడు, అర్బన్ హౌసింగ్ మంత్రి పి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.