తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ఎండలు మండిపోతున్నా.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో రిసెప్షన్లకు, పార్టీలకు ఎక్కువగా చికెన్ సరఫరా జరగడంతో వాటి ప్రభావం ధరల మీద కూడా పడింది. గతంలో చికెన్‌ లైవ్‌ రూ.80 ఉండగా, ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం అది రూ.125 నుంచి రూ.130కి చేరింది. అలాగే స్కిన్‌ కిలో రూ.125 నుంచి రూ.150 వరకు ఉండగా ప్రస్తుతం రూ.185 కి చేరువలో ఉంది. ఇక సాధారణంగా రూ.160 నుండి రూ.170 వరకు ఉండే స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర... ఇప్పుడు రూ.215 నుంచి రూ.220 వరకూ చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే ఈ నెలలోనే రంజాన్ పండుగ కూడా వస్తుంది కాబట్టి.. చికెన్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందనేది మార్కెట్ టాక్. అయితే చికెన్ ధరలు అమాంతం పెరగడానికి ఎండ వల్ల ఎక్కువగా కోళ్లు చనిపోవడం కూడా అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఈ చికెన్ ధరల ప్రభావం బిర్యానీ సెంటర్ల మీద, హాలీమ్ ఓట్ లెట్లపై కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు.


ఈ క్రమంలో కోళ్లు ఎండాకాలంలో మృత్యువాత బారిన పడకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు వెటర్నరీ శాఖ అధికారులు రైతులకు సలహాలు ఇస్తున్నారు. కోళ్ల ఫారాల పైకప్పు రేకులపై స్పింకర్లు ఏర్పాటు చేసి వేడిని తగ్గించడంతో పాటు.. కోళ్ల మేతలో కాల్షియం, గ్లూకోజ్‌ని ఎక్కువగా చేర్చాలని అంటున్నారు. ఎండాకాలంలో కోళ్లు మృత్యువాత బారిన పడడంతో గుడ్ల ఉత్పత్తి కూడా తగ్గుముఖం పడుతుంది.