అమరావతిలో బాలల చిత్రాల పండగ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం అమరావతిలో బాలల చలన చిత్రోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాన్ని ఈ రోజు సినీనటి రోజారమణి, కలెక్టర్ లక్ష్మీకాంతంలు ఘనంగా ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ చిత్రోత్సవంలో భాగంగా పిల్లల కోసం ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాపును నిర్వహించనున్నారు. పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ నుండి వచ్చే అధ్యాపకులు ఈ వర్క్ షాపును నిర్వహిస్తారు. అలాగే ఈ ఉత్సవంలో మూడు రోజుల పాటు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వివిధ దేశాల బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు ప్రదర్శించడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఉత్సవం నిర్వహించడానికి ప్రభుత్వం 15 లక్షల రూపాయలు కేటాయించింది. తొలి రోజు జరిగిన ఉత్సవ ప్రారంభోత్సవవానికి మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ నివాస్‌లు హాజరయ్యారు. దాదాపు 45 పాఠశాలలు ఈ ఉత్సవానికి హాజరవుతారని సమాచారం. ఈ చిత్రోత్సవానికి టాలీవుడ్ నటులు ఆదర్శ్, నిఖిల్ కూడా హాజరై పిల్లలతో కలిసి చిత్రాలను వీక్షించనున్నారు.