కాకికాడ: తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ వర్గపోరు తాజా స్థాయికి చేరింది. ఈ పోరు తీవ్ర స్థాయికి చేరి కొట్లాటకు వరకు దారి తీసింది.  జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ఇందుకు వేదికగా నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలేం జరిగింది..?


ప్రముఖ మీడియా కథనం ప్రకారం ప్రత్తిపాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ కు  వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం. మురళీకృష్ణంరాజు ఎదురువెళ్లి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంలో పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి భారీ సంఖ్యలో తన అనుచరులతో కలిసి జగన్ కు స్వాగతం పలికారు. తన డామినేషన్ చూపిస్తూ మురళీ అనుసరించిన తీరు మరోవర్గానికి ఇది నచ్చలేదు. దీనికి తోడు మధ్యాహ్న భోజన విరామ సమయంలో మురళీకృష్ణంరాజు తన అనుచరులతో జెండాలు చేతబూని జగన్ ముందు సందడి చేశారు.


మురళీకృష్ణంరాజు తీరుతో అగ్రహం కట్టలు తెంచుకున్న ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్‌ పూర్ణచంద్రప్రసాద్‌ వారి వద్ద ఉన్న పార్టీ జెండాలను తీసుకుని విసిరివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నడిచి అది కాస్త ఘర్షణకు దారి తీసింది. పార్టీ నేతలు సముదాయించడంతో వివాదం తాత్కాలికంగా సమసిపోయింది.