CM Jagan Released Jagananna Vidya Deevena Funds: మన సమాజంలో పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయని.. ఆ కుటుంబాల తలరాతలు మారాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆ కుటుంబాల నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు లాంటి వారు రావాలని ఆకాంక్షించారు. పేదరికం అనే సంకెళ్లను వారు తెంచుకోవాలని.. దానికి చదవులు ఒక్కటే మార్గం అని పేర్కొన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విద్యా దీవెన కార్యక్రమం కింద జనవరి–మార్చి త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు రూ.703 కోట్లు విడుదల చేశారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి బటన్‌ నొక్కి నేరుగా జమచేశారు. ఇప్పటివరకూ విద్యా దీవెన పథకం కోసం పెట్టిన ఖర్చు రూ.14,912.43 కోట్లు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలుగా చదువుల విప్లవం చేపట్టామని.. చదువులు అన్నవి పేదలకు ఒక హక్కుగా అందాలని అన్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలను అమలు చేస్తున్నామని.. పూర్తి ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రతి త్రైమాసికంలోనూ జమచేస్తున్నామని అన్నారు. జనవరి-ఫిబ్రవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి ఇప్పుడు డబ్బు జమచేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో అరకొరగా ఫీజులు ఇచ్చారని.. 1777 కోట్ల రూపాయలు బకాయిపెట్టాడని మండిపడ్డారు.
ప్రతి ఏటా వసతి దీవెన కింద రెండుమార్లు తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నామని చెప్పారు. కేవలం ఒక్క ఈ పథకానికే రూ.4,275.76 ఖర్చు చేశామని వెల్లడించారు. 


"చంద్రబాబు గారి హయాంలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. ఫీజులు అరకొరగా ఇచ్చేవారు. ఎప్పుడు ఇచ్చేవారో తెలిసేది కాదు. ముష్టి వేసినట్టు ఇచ్చేవారు. కేవలం రూ.35 వేలు ఇచ్చేవారు. మన ప్రభుత్వం ఫీజులు ఎంతైతే అంత ఇస్తోంది. పిల్లలకు మంచి జరగాలని ఎంత ఫీజులైతే అంత చెల్లిస్తున్నాం. ఎంత ఫీజులైనా ఫర్వాలేదు.. మీరు చదవండి.. మీ జగనన్న చెల్లిస్తాడు. మీ పిల్లలకు మంచి మేనమామగా ఎప్పుడూ ఉంటాను. ఇలాంటి పథకాలు ఇస్తుంటే.. రాష్ట్రం దివాళా తీస్తుందని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మీడియా వ్యవస్థలు కొన్ని ఇలానే మాట్లాడుతున్నాయి.


రాబోయే రోజుల్లో రాష్ట్రానికి దశ, దిశ ఆంధ్రప్రదేశ్‌‌ చూపిస్తోంది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా నర్సరీ నుంచి, ఉన్నత విద్యవరకూ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. అందులో చదువులు కూడా మారుతున్నాయి. సీబీఎస్‌ఈ ఇంగ్లీష్‌ మీడియం చదువులు వచ్చాయి. బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ వచ్చాయి. గొప్ప మార్పులకు నిరద్శనం ఇది. విద్యాకానుక ద్వారా స్కూళ్లు తెరిచే సమయానికి కిట్లను అందిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న ప్రతి పిల్లాడికి మంచి బోధన అందించడంపై దృష్టిపెట్టాం. సబ్జెక్టు టీచర్ల కాన్సెప్టు తీసుకు వచ్చాం.. పిల్లలకు ఇంటికి వెళ్లిన తర్వాత ట్యూటర్‌ ఉండాలన్న తాపత్రయంతో బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్స్‌ ఇచ్చాం. ఆఫ్‌లైన్‌లో పనిచేసే  ట్యాబులు ఇచ్చాం..


గత ప్రభుత్వం చివరి ఏడాదిలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు 37లక్షలు ఉంటే.. ఆ సంఖ్య 40 లక్షలు దాటింది. ప్రభుత్వ స్కూళ్ల మీద నమ్మకం కలిగింది. డ్రాప్‌ అవుట్స్‌ గణనీయంగా తగ్గాయి. డిగ్రీల్లో చేరకుండా 2018-19లో 81,813 ఉంటే అది 2022-23 నాటికి 22,387కు తగ్గింది. 2018-19లో ఇంజినీరింగ్‌ చదివేవాళ్లు 80 వేలు మంది అయితే ఈ ప్రభుత్వంలో 1.2 లక్షలమంది చదువుతున్నారు. దాదాపు 50 శాతం వృద్ధి ఉంది. ఉన్నత విద్యతో పాఠ్యప్రణాళికను మార్చాం. జాబో ఓరియంటెడ్‌గా తీర్చిదిద్దాం." అని సీఎం జగన్ తెలిపారు.
 
తోడేళ్లంతా కలిసికట్టుగా ఏకం అవుతామంటన్నారని.. జగన్‌కు వారి మాదిరిగా మీడియా ఉండకపోవచ్చు.. దత్తపుత్రుడి సపోర్టూ ఉండకపోవచ్చన్నారు. ఇవాళ జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్‌వార్ అని అన్నారు. పేదవాడు ఒకవైపున ఉన్నాడు.. పెత్తందార్లు మరోవైపున ఉన్నాడని పేర్కొన్నారు. మీ ఇంట్లో మంచి జరిగిందా..? లేదా..? అన్నదే కొలమానంగా తీసుకోవాలని కోరారు. మంచి జరిగితే.. జగనన్నకు తోడుగా నిలవాలని అన్నారు. 


Also Read: Jammu Kashmir Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి  


Also Read: LSG Vs MI Dream11 Team Prediction: ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచేదెవరు..? లక్నోతో ముంబై ఢీ.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook