విశాఖపట్నం: మహారాష్ట్రలోని విదర్భ పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం, అక్కడి నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు కోస్తా, తెలంగాణలో అధికమవుతున్న ఎండ తీవ్రతకుతోడు సముద్రంపై నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. వీటన్నింటి ప్రభావంతో మంగళవారం కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. 


ఇదిలావుంటే, మరోవైపు రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలోని విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలు కురవని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.